అమ్మో ఒకటో తారీకు.. హడలిపోతున్న ఏపీ ఉద్యోగులు
డిమాండ్ల సాధనకు రెండో దశ కార్యచరణ ప్రకటించారు ఏపీ ఉద్యోగులు. ఇప్పటికే నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్న ఉద్యోగులు ఈనెల 29వరకు ఈ తరహా నిరసన కంటిన్యూ చేయబోతున్నారు.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు. రేపు పడతాయో లేదో కూడా అనుమానమే. అవ్వా తాతలకు మూడో తేదీనుంచి పింఛన్ల పంపిణీ మొదలు పెట్టి ఈపాటికే అందరికీ వాలంటీర్లు ఇచ్చేశారు. కానీ ఉద్యోగులు, ప్రభుత్వ పింఛన్ అందుకునే రిటైర్మెంట్ ఉద్యోగులు బ్యాంక్ మెసేజ్ ల కోసం వేచి చూస్తున్నారు. ఇక ఉపాధ్యాయుల సంగతి సరేసరి. ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకటో తేదీ జీతం తీసుకుని ఏడాది దాటిపోయింది. కనిష్టంగా ఏడో తేదీ, లేదా గరిష్టంగా 14వతేదీల్లో వారికి జీతాలు పడుతున్నాయి. ఏపీలో అత్యథికంగా ఈఎంఐల చెక్కులు బౌన్స్ అవుతున్న కేటగిరీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఉద్యమబాట..
ఉద్యోగుల ప్రధాన సమస్యలేవీ ఇప్పటి వరకు పరిష్కారం కాలేదన్నారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఒకటో తేదీన జీతాలు పడితే చాలు అనే పరిస్థితికి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారని, జీతాలు సక్రమంగా చెల్లించలేకపోవడానికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారాయన. రికమెండ్ చేసిన పే స్కేల్స్ ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు రెండో దశ కార్యచరణ ప్రకటించారు. ఇప్పటికే నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్న ఉద్యోగులు ఈనెల 29వరకు ఈ తరహా నిరసన కంటిన్యూ చేయబోతున్నారు. PRC ఎరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగుల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ చెల్లింపులు సరిగా లేకపోవటం వల్ల ఆస్పత్రుల్లో వైద్యం అందడంలేదని చెప్పారు.
కార్యాచరణ ఇలా..
ఈనెల 8వ తేదీన నల్ల కండువాలతో రోడ్లపై నిరసన ఉంటుందని తెలిపారు జేఏసీ నేతలు. 10వ తేదీ సోమవారం గ్రీవెన్స్ డే రోజున స్పందన కార్యక్రమాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. 11వ తేదీన సెల్ డౌన్, 12వ తేదీన 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా, 15వ తేదీ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పరామర్శ, 18వ తేదీన సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా చేపడతామన్నారు.
బ్యాంకుల్లో మొర..
ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక ఇప్పటికే చాలాసార్లు ఉద్యోగుల చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ సమస్యపై కూడా వారు బ్యాంకులకు వినతిపత్రాలు ఇవ్వబోతున్నారు. పెనాల్టీలనుంచి విముక్తి కలిగించాలంటూ ఈనెల 20వ తేదీన బ్యాంకుల సందర్శన చేపడతామంటున్నారు ఉద్యోగులు. 25 నుంచి 29 వరకు వివిధ కేటగిరీల ఉద్యోగులతో ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు.