Telugu Global
Andhra Pradesh

వెనక్కి తగ్గని జగన్.. నేడు బస్సుయాత్ర పునఃప్రారంభం

గుడివాడ సభకు జనం భారీగా తరలి వస్తున్నారు. గాయం తర్వాత తొలిసారి జగన్ ని చూసేందుకు వారంతా ఆసక్తి చూపిస్తున్నారు.

వెనక్కి తగ్గని జగన్.. నేడు బస్సుయాత్ర పునఃప్రారంభం
X

తలకి గాయం అయినా, కుట్లు పడినా, విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించినా సీఎం జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం ఒకరోజు విశ్రాంతితో ఆయన తిరిగి జనంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర యథావిధిగా జరుగుతుందని వైసీపీ నేతలు తెలిపారు. ఈరోజు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కృష్ణా జిల్లాలో నేడు యాత్ర కొనసాగుతుంది. కేసరపల్లి నుంచి ఉదయం బస్సులో సీఎం జగన్ బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్‌ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభ ఉంటుంది.


జగన్ ప్రసంగంపై ఆసక్తి..

తనకు గాయమైన తర్వాత సీఎం జగన్ ఇప్పటి వరకు ఎక్కడా మీడియాతో మాట్లాడలేదు. గాయం తగిలిన తర్వాత ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన బస్సు దిగారు. బస్సులో ప్రాథమిక చికిత్స అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు, ఆదివారం విశ్రాంతి తర్వాత తిరిగి సోమవారం బస్సుయాత్ర మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రాత్రి గుడివాడ సభ అనంతరం హనుమాన్‌ జంక్షన్‌ హైవే, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుంటారు. అక్కడ రాత్రి బస ఏర్పాట్లు జరిగాయి. గుడివాడలో జగన్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. తనపై జరిగిన హత్యాయత్నంపై ఆయన తొలిసారి స్పందించే అవకాశముంది. అలాగే ప్రతిపక్షాల వ్యాఖ్యలకు కూడా ఆయన కౌంటర్ ఇస్తారని తెలుస్తోంది.

గుడివాడకు తరలి వస్తున్న జనం..

గుడివాడ సభకు జనం భారీగా తరలి వస్తున్నారు. గాయం తర్వాత తొలిసారి జగన్ ని చూసేందుకు వారంతా ఆసక్తి చూపిస్తున్నారు. పైగా గుడివాడలో స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కొడాలి నాని ప్రసంగం కూడా పవర్ ఫుల్ గా ఉంటుందని, ప్రతిపక్షాలపై ఆయన విమర్శలతో విరుచుకుపడతారని తెలుస్తోంది.

First Published:  15 April 2024 8:12 AM IST
Next Story