ఇక ఆ భయం లేనట్లేనా? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీలో ఉత్సాహం!
అందరి అంచనాలను ఈ ఎన్నికలు తారుమారు చేశాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అంతా ఉట్టిదే అని తేలిపోయింది.
తాజాగా వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీలో ఉత్సాహాన్ని తీసుకొని వస్తోంది. ముఖ్యంగా టీచర్స్ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు అనేక అనుమానాలను పటాపంచలు చేసింది. ఇటీవల కాలంలో అధికార వైసీపీపై ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మోసం చేశారని.. సీపీఎస్ రద్దు హామీని నిలబెట్టుకోవలేదని ఉద్యోగులు గొడవ చేస్తున్నారు. ఈ ఉద్యమాల్లో ఉపాధ్యాయులే ముందున్నారు. బకాయిలను సకాలంలో విడుదల చేయడం లేదని కూడా టీచర్లు గుర్రుగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల వచ్చాయి. ఇక్కడ తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత కనపడుతుందని అందరూ అంచనా వేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఈ వ్యతిరేకతను ఉపయోగించుకోవాలని భావించింది. కానీ అందరి అంచనాలను ఈ ఎన్నికలు తారుమారు చేశాయి. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అంతా ఉట్టిదే అని తేలిపోయింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనే కాకుండా.. స్థానిక సంస్థల నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇది అధికార పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపింది.
సాధారణంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌కు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. గతంలో పీడీఎఫ్ అభ్యర్థులకు వైసీపీ మద్దతు పలికింది. అయితే ఈ సారి మాత్రం వైసీపీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపింది. నెల్లూరు-చిత్తూరు-ప్రకాశం జిల్లాల నియోజకవర్గం నుంచి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఆ మూడు జిల్లాల్లో మంచి పేరున్న చంద్రశేఖర్ రెడ్డి పాపులారిటీ వైసీపీకి కలసి వచ్చింది. ఆయన పీడీఎఫ్ అభ్యర్థి బాబు రెడ్డిపై గెలుపొందారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎంవీ. రామచంద్రారెడ్డిని బరిలోకి దింపారు. ఆయన పీడీఎఫ్ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 165 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ కాస్త టఫ్ పోటీ జరిగినా చివరకు వైసీపీ అభ్యర్థినే గెలుపు వరించింది.
వైసీపీ ప్రభుత్వంపై టీచర్లు చాలా వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారానికి వ్యతిరేకంగా ఫలితాలు రావడం పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. గతంలో ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేసిన ఉపాధ్యాయులు.. తీరా ఎన్నికలు వచ్చే సమయానికి ప్రభుత్వానికి అండగా నిలబడటం విశేషం. ఉపాధ్యాయుల మద్దతు తమకే ఉందని ఇకపై వైసీపీ నేతలు చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఒక రకంగా ప్రతిపక్షాలకు పెద్ద ఎదురు దెబ్బని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సారి ఎన్నికల్లో ప్రైవేటు టీచర్లకు కూడా ఓటు హక్కు రావడం కూడా వైసీపీకి కలసి వచ్చింది. కేవలం ప్రభుత్వ టీచర్లకు మాత్రమే ఓటు హక్కు ఉండి ఉంటే ఫలితాలు ఏక పక్షంగా ఉండేవి కావని.. ప్రైవేటు టీచర్లు కూడా ఓటు హక్కు కలిగి ఉండటం కలిసి వచ్చింని అంటున్నారు. మరోవైపు ఆరు నెలల ముందు నుంచే వైసీపీ ఈ ఎన్నికలపై ఫోకస్ చేసింది. ముందు నుంచి ఒక వ్యూహం ప్రకారం వెళ్లడంతో విజయాలు సునాయాసంగా దక్కాయి. టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ విషయంలో వైసీపీ పక్కా వ్యూహం ఫలించడంతో పాటు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కూడా పార్టీ ఖాతాలోనే పడటంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక బూస్ట్ లాగా పని చేస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.