Telugu Global
Andhra Pradesh

నో డౌట్.. ఆగస్టు-1నుంచే పెరిగిన జీతాలు..

గ్రామ సచివాలయ (Grama Ward Sachivalayam) ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు జీతభత్యాల కోసం కేటాయించినట్టయింది.

Grama Ward Sachivalayam
X

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారైనా.. పెరిగిన జీతాలు ఆగస్టు 1నుంచి అందుతాయా లేదా అనే అనుమానం చాలామందిలో ఉంది. ఉద్యోగుల జీతాలు పెంచాలంటే బడ్జెట్ లో కేటాయింపులు ఉండాలి, కానీ 2022-23 ఏపీ బడ్జెట్ లో ఆ కేటాయింపులు లేవని, మరికొన్ని రోజులు సచివాలయ ఉద్యోగులు వేచి చూడాల్సిందేననే వార్తలు వినిపించాయి. గతంలో కూడా ఇలాగే ఊరించి ఊరించి ఉసూరుమనిపించారనే అపవాదు కూడా ప్రభుత్వంపై ఉంది. దీంతో మరోసారి ఉద్యోగులు డీలా పడ్డారు.


రెండు మూడు రోజులుగా లోలోపల మథనపడుతున్నారు. అయితే అలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం అదనపు బడ్జెట్ కేటాయించింది. గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులిచ్చారు. వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా త్వరలోనే ఇదే తరహా ఉత్తర్వులు రాబోతున్నాయి. దీంతో ఆగస్టు-1న సచివాలయ ఉద్యోగులు పెరిగిన జీతాలు అందుకుంటారని ఖాయంగా తేలిపోయింది.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఖరారు తర్వాత కొత్త జీతాలకోసం వివిధ ఖాతా(హెడ్)ల ఏర్పాటు కూడా పూర్తయింది, ఇప్పుడు అదనపు బడ్జెట్ కేటాయింపులతో ఆ వ్యవహారం పరిపూర్ణమైంది. పెరిగిన పే స్కేల్ తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్స్‌ లు కలిపి జీతాలు చెల్లిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు జీతభత్యాల కోసం కేటాయించినట్టయింది.

థ్యాంక్యూ సీఎం సార్..

జీతాల పెంపుపై క్లారిటీ రావడంతో సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లాల్లో థ్యాంక్యూ సీఎం సార్ అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రొబేషన్ డిక్లేర్ అయినవారందరికీ ఆగస్టు-1నుంచి కొత్త వేతనాలు అందుబాటులోకి వస్తాయి. అయితే ప్రొబేషన్ డిక్లేర్ కాని కొంతమంది మరికొన్నాళ్లు వేచి చూడక తప్పని పరిస్థితి. మొత్తమ్మీద పెరిగిన వేతనాల పే స్లిప్పులు అందితే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు, సచివాలయ కేడర్ ఉద్యోగుల జీతాలకు వ్యత్యాసం ఉందా లేదా అనేది తేలిపోతుంది. అలవెన్స్ లు ఇతర విషయాల్లో రెండు డిపార్ట్ మెంట్లు ఒకటేనా లేక వేర్వేరుగా ఉన్నాయా అనే విషయంలో కూడా క్లారిటీ వస్తుంది.

First Published:  26 July 2022 8:09 AM IST
Next Story