Telugu Global
Andhra Pradesh

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం.. అందులో రాజీలేదు - సీఎం జగన్‌

ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై తమ ప్రభుత్వం నిరంతరాయంగా ఒత్తిడి చేస్తూనే ఉందని జగన్‌ చెప్పారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం.. అందులో రాజీలేదు - సీఎం జగన్‌
X

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని, స్టీల్‌ ప్లాంట్‌ పునర్‌ వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం విశాఖపట్నం సమీపంలోని ఎండాడ వద్ద సీఎం క్యాంపులో ఆయన్ని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తమది రాజీలేని ధోరణి అని స్పష్టం చేశారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై తమ ప్రభుత్వం నిరంతరాయంగా ఒత్తిడి చేస్తూనే ఉందని జగన్‌ చెప్పారు.

ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ కూడా స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తాయని స్పష్టం చేశారు. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తిందని చెప్పారు. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశామని తెలిపారు. అంతేకాదు.. స్టీల్‌ ప్లాంట్‌ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని వివరించారు.

ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టు కట్టి కూటమిగా ఏర్పడ్డాయని, స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయని జగన్‌ చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడిందని తెలిపారు. ఇనుప ఖనిజం గనులను శాశ్వతంగా కేటాయించడం ద్వారా ప్లాంట్‌ పరిస్థితి మెరుగుపడుతుందని జగన్‌ చెప్పారు. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారమవుతాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతిక హక్కు తమకే ఉందని జగన్‌ చెప్పారు. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

కేంద్రంలో బీజేపీకి మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నాం..

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌పై తమ వైఖరిలో ఏ మార్పూ లేదని చెప్పారు. తాము కన్సెంటు ఇవ్వలేదు కాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిందని ఆయన చెప్పారు. ఉద్యమానికి మొదటి నుంచి వైసీపీ అండగా ఉందన్నారు. ఇకపై కూడా ప్రభుత్వ సహకారంతోనే ఉద్యమం జరుగుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకూడదని తాము కోరుకుంటున్నామని అమర్‌నాథ్‌ చెప్పారు.

First Published:  23 April 2024 11:13 AM GMT
Next Story