మాజీ వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లు అయితే టీడీపీ పరిస్థితి ఏంటి..?
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలతో టీడీపీకి ఉక్కపోత మొదలైంది. అసలే తమపై కోపంతో ఉన్న వాలంటీర్లను వైసీపీ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టుకుంటే పరిస్థితి ఏంటని వారు భయపడుతున్నారు. అందుకే మళ్లీ నిమ్మగడ్డను తెరపైకి తెచ్చారు.
వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన చంద్రబాబు ఎట్టకేలకు నిమ్మగడ్డను అడ్డు పెట్టుకుని డ్రామా రక్తి కట్టించారు. ఎన్నికలకే కాదు, కనీసం పెన్షన్లు ఇచ్చే విధులు కూడా నిర్వహించడానికి వీల్లేకుండా వాలంటీర్లను అడ్డుకున్నారు. దీంతో కడుపుమండిన వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. అయితే ఒకసారి రాజీనామా చేశాక వారిపై ఇంకెలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. అయితే అలా రాజీనామా చేసిన వాలంటీర్లంతా ఎన్నికల్లో వైసీపీకి పోలింగ్ ఏజెంట్లుగా మారితే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. చంద్రబాబు తన వేలితో తన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది. అందుకే మళ్లీ డ్రామా మొదలు పెట్టారు. నిమ్మగడ్డ మళ్లీ కొత్త ఆరోపణలు మొదలు పెట్టారు.
అధికార పార్టీ నేతల ప్రేరణతో ఇటీవల రాజీనామాలు చేసిన, చేస్తున్న వాలంటీర్లను పోలింగ్ బూత్‌లో ఏజెంట్లుగా కూర్చోపెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు నిమ్మగడ్డ రమేష్. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని సిటిజెన్ ఫర్ డెమొక్రసీ సంస్థ తరపున ఆయన డిమాండ్ చేస్తున్నారు. అంటే రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా పోలింగ్ ఏజెంట్లుగా ఎంపిక చేసుకునే అవకాశం రాజకీయ పార్టీలకు ఇవ్వొద్దని నిమ్మగడ్డ అంటున్నారు.
ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే వైసీపీ అనే అర్థం. ఎందుకంటే వాలంటీర్లంతా వైసీపీకి వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తున్నారనేది చంద్రబాబు అండ్ టీమ్ ఆరోపణ. అందుకే వారిపై కక్షగట్టి విధులకు దూరం చేశారు. కానీ వారంతా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇటీవల వైసీపీ నేతలు కూడా.. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు అవే పోస్ట్ లు ఇప్పిస్తామని, వారి భవిష్యత్తుకు గ్యారెంటీగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. దీంతో వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. సీఎం జగన్ కూడా తాను రెండోసారి అధికారంలోకి వచ్చాక మొదట సంతకం పెట్టే ఫైల్ కూడా వాలంటీర్లదేనని చెప్పడం విశేషం. దీంతో వాలంటీర్లకు భరోసా లభించింది. ఈ రాజీనామాలతో టీడీపీకి ఉక్కపోత మొదలైంది. అసలే తమపై కోపంతో ఉన్న వాలంటీర్లను వైసీపీ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టుకుంటే పరిస్థితి ఏంటని వారు భయపడుతున్నారు. అందుకే మళ్లీ నిమ్మగడ్డను తెరపైకి తెచ్చారు.