Telugu Global
Andhra Pradesh

ఆర్కే భార్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు..!

అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ భార్య శిరీష‌ ఇంట్లో ఎన్ ఐ ఏ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆమె ఇంటి తో పాటు విరసం సభ్యుడు కళ్యాణ్ రావు ఇంట్లో కూడా సోదాలు చేశారు

ఆర్కే భార్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు..!
X

దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమెతోపాటు విరసం నేత కల్యాణ్ రావు, విజయవాడ సింగ్ నగర్ లోని దొడ్డి ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఆర్కే చనిపోయిన అనంతరం కూడా పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉండటం గమనార్హం.

తాజాగా మంగళవారం ఎన్ఐఏ అధికారులు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరుపాడుకు చేరుకొని.. ఆర్కే భార్య శిరీష, కల్యాణరావు ఇంట్లో తనిఖీలు చేశారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు రాలేదు. లోకల్ పోలీసులకు కూడా సమాచారం లేదు. మరోవైపు మీడియాను కూడా అటువైపు రానివ్వలేదు.

ఇటీవల కొందరు అజ్ఞాత వ్యక్తులు శిరీష ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నట్టు సమాచారం. మరోవైపు విజయవాడ నుంచి వారికి భారీగా నగదు అందబోతున్నట్టు కూడా ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందిందట. అయితే ఇందులో నిజమెంత ఉందో? తెలియదుగానీ ఎన్ఐఏ అధికారుల తీరుపట్ల ప్రజాస్వామికవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై ఆర్కే భార్య శిరీష తీవ్రంగా స్పందించారు. 'పోలీసులు, ఎన్ఐఏ నన్నెందుకు లక్ష్యం చేసుకున్నారో అర్థం కావడం లేదు. నేను ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాను. నేరస్థులు, దొంగలు దర్జాగా రోడ్ల మీద తిరుగుతుంటే వదిలిపెట్టే పోలీసులు నన్ను మాత్రం టార్గెట్ చేశారు' అని ఆమె పేర్కొన్నారు.

First Published:  19 July 2022 3:18 PM IST
Next Story