Telugu Global
Andhra Pradesh

జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే

బాధితులతో సహా మిగిలిన సాక్షులంతా తప్పనిసరిగా కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు జడ్జి. నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది.

జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే
X

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసులో ఎన్ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్ఐఏ తీరును కూడా కోర్టు తప్పు పట్టింది.

బాధితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీసింది. జగన్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశామని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అలా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే చార్జ్ షీట్లో అది ఎందుకు లేదని కోర్టు ప్రశ్నించింది. బాధితుడిని విచారించకుండా మిగిలిన సాక్షులను విచారించి ఏం ఉపయోగమని కోర్టు వ్యాఖ్యానించింది .

బాధితుడుగా ఉన్న జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఏమి టేప్ రికార్డర్ కాదని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ కేసులో 56 మందిని విచారిస్తే ఒకటి నుంచి 12 వరకు ఉన్న వారి స్టేట్మెంట్లు చార్జిషీట్లో ఎందుకు లేవని నిలదీసింది.

బాధితులతో సహా మిగిలిన సాక్షులంతా తప్పనిసరిగా కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు జడ్జి. నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది. ఈనెల 31 నుంచి ఈ కేసు విచారణకు సంబంధించి షెడ్యూల్ ను కోర్టు ప్రకటించింది. 2018 అక్టోబర్ 25న జగన్మోహన్ రెడ్డి పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడు. ఆ సమయంలో రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని వైసీపీ డిమాండ్ చేయడంతో ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించారు.

ఎన్ఐఏ రంగంలోకి దిగినప్పటికీ ఈ కేసును మాత్రం ఇప్పటికి ఒక కొలిక్కి తీసుకురాలేకపోయింది. దాంతో నాలుగేళ్లుగా నిందితుడు శ్రీనివాస్ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 2019లో శ్రీనివాస్ కు ఒకసారి బెయిల్ మంజూరైనప్పటికీ దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించి బెయిలు రద్దు చేయించింది. ఈ కేసు ఎప్పటికీ తేలుతుంది అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

First Published:  13 Jan 2023 4:34 PM IST
Next Story