Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబుతో బీజేపీ జ‌త‌క‌డుతుందా..? అదంత‌ సులువేనా..?

చంద్రబాబు చేసిన గాయాన్ని మోడీ, బీజేపీ నేతలు సులభంగా మరిచిపోయి, టీడీపీతో జత కట్టడానికి ముందుకు వస్తారా..? అనేది ప్రశ్న. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చుననేది నిజమే గానీ మోడీ, బీజేపీ నాయకులు చంద్రబాబు కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివారు.

చంద్ర‌బాబుతో బీజేపీ జ‌త‌క‌డుతుందా..? అదంత‌ సులువేనా..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం పడరాని పాట్లు పడుతున్నట్లు అర్థమవుతోంది. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించడానికి ఆయన ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ఎలాగూ పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి తాపత్రయపడుతున్నారు. జనసేనకు 30 లోపే సీట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు, అందుకు పవన్‌ కల్యాణ్‌ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అదే నిజ‌మైతే.. ఒకవేళ టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చినా పవన్‌ కల్యాణ్‌ గానీ, ఆయన పార్టీ గానీ చంద్రబాబుపై ఒత్తిడి పెట్టే పరిస్థితి ఉండదు.

ఈ స్థితిలో తమ కూటమితో కలిసి వచ్చేలా బీజేపీని ఒప్పించడానికి పవన్‌ కల్యాణ్‌ తెగ ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీతో చర్చలు జరపడానికి ఆయన ఈ వారంలో ఢిల్లీ వెళ్తారనే మాట‌లు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి బీజేపీ అంగీకరిస్తుందా అనేది అనుమానమే. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టి ప్రధాని మోడీని, బీజేపీని తీవ్రంగా దూషించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని తేవడానికి తానే చక్రం తిప్పుతున్నట్లు ఫోజులు కొట్టారు. అయితే, చంద్రబాబు కర్మ కాలి మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది, మోడీ ప్రధాని అయ్యారు.

చంద్రబాబు చేసిన గాయాన్ని మోడీ, బీజేపీ నేతలు సులభంగా మరిచిపోయి, టీడీపీతో జత కట్టడానికి ముందుకు వస్తారా..? అనేది ప్రశ్న. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చుననేది నిజమే గానీ మోడీ, బీజేపీ నాయకులు చంద్రబాబు కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివారు. తాము రాష్ట్రంలో ప్రధానమైన పాత్ర పోషించడానికి వీలుంటే తప్ప బీజేపీ ముందుకు రాదని చెప్పవచ్చు. పైగా, వైఎస్‌ జగన్‌తో బీజేపీకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈ స్థితిలో పవన్‌ కల్యాణ్‌ ఒత్తిడికి బీజేపీ తలొగ్గుతుందని కూడా అనుకోలేం. చంద్రబాబు నమ్మడానికి కూడా బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండరు. అందువల్ల బీజేపీ టీడీపీతో కలిసి వచ్చే అవకాశాలు తక్కువే. అయినా, బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

First Published:  6 Feb 2024 1:28 PM GMT
Next Story