Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేలమంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం

సిఫార్సు లేఖల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఫైర్‌

ఎమ్మెల్యేలమంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం
X

సిఫార్సు లేఖల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఆయన.. లెటర్ల అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలో టీటీడీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులందరి సీఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 294 మంది ఎమ్మెల్యేలకు బ్రేక్‌ దర్శనాలు, వసతి సౌకర్యాలు కల్పించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రజాప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ వివక్ష బాధాకరం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలక మండలి కూడా అందుకు అంగీకరించింది. అయితే స్వయంగా సీఎం ఆదేశించినా.. అధికారులు మాత్రం అమలు చేయడం లేదు. ఎందుకు? తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు, రూమ్‌ల సౌకర్యం కల్పించాలి. ఈ వివక్షపై టీటీడీ పునరాలోచించాలి. ఈ విషయమై పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించాలి. ఎండాకాలం సెలవుల్లో సిఫార్సు లేఖలు జారీ చేస్తాం. అనుమతించకపోతే ఎమ్మెల్యేలమంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం. పార్టీలకు అతీతంగా నేను ఇది చెబుతున్నానని రఘునందన్‌రావు హెచ్చరించారు.

First Published:  14 March 2025 1:39 PM IST
Next Story