సుప్రీంలో పిటిషన్, సీబీఐకి లేఖ.. అవినాష్ అరెస్ట్ ఖాయమేనా..?
అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమెను సీఎం జగన్ తల్లి విజయమ్మ పరామర్శించారు.
ఓవైపు అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం, మరోవైపు సీబీఐ నుంచి ఆయనకు వరుస నోటీసులు.. వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో అసలు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. సీబీఐ విచారణకు హాజరైతే కచ్చితంగా ఆయన్ను అరెస్ట్ చేస్తారనే అనుమానాలున్నాయి. ఈరోజు నేరుగా జిల్లా ఎస్పీని సీబీఐ అధికారులు కలవడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. అయితే అవినాష్ రెడ్డి మాత్రం పట్టువిడవడంలేదు. తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
సుప్రీంలో పిటిషన్..
సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. తన తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఈ నెల 27 వరకు సీబీఐ విచారణకు మినహాయింపు ఇవ్వాలని, అప్పటి వరకు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని సుప్రీంని కోరారు. వెకేషన్ బెంచ్ విచారణకు నిరాకరించడంతో ఇప్పుడేం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.
సీబీఐకి లేఖ..
తాను విచారణకు హాజరు కాలేనని ఇదివరకే సమాచారం పంపించిన అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ నెల 27వ తేదీ వరకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
మరో వైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఈరోజు ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. కర్నూలులోని విశ్వభారతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను సీఎం జగన్ తల్లి విజయమ్మ పరామర్శించారు.
తగ్గేదే లేదంటున్న సీబీఐ..
అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో కర్నూలు ఎస్పీని సీబీఐ అధికారులు ఈరోజు రెండుసార్లు కలిశారు. సీబీఐ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అవినాష్ అరెస్టుపై ఎస్పీ కృష్ణకాంత్ స్పష్టత ఇవ్వలేదు. డీజీపీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారని తెలుస్తోంది. పరిమిత సిబ్బందితో అవినాష్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకునే అవకాశం లేదు, అందుకే పోలీసుల సపోర్ట్ కోరారు, అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ ని రంగంలోకి దించుతారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.