ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద అత్యాధునిక భద్రత.. దేశంలోనే ఇలాంటి టెక్నాలజీ ముఖ్యమంత్రి ఇంటికి తొలిసారి..
YS Jagan Mohan Reddy House New Technology High Security: సీఎం ఇంటి దగ్గరకు వెళ్లే రహదారిపై అక్కడక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి. క్యాంపు కార్యాలయం వద్ద కూడా పోలీసులు నిరంతరం పహారా కాస్తుంటారు. కానీ ఇప్పుడు చెక్ పోస్టులు, ఇతర తనిఖీలు లేకుండా బొల్లార్డ్స్, టైర్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేశారు.

ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద అత్యాధునిక భద్రత.. దేశంలోనే ఇలాంటి టెక్నాలజీ ముఖ్యమంత్రి ఇంటికి తొలిసారి..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రికీ లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీతో సెక్యూరిటీని పెంచారు. ఈ పరికరాల కొనుగోలు, ఇన్‌స్టాలేషన్‌కు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఈ సెక్యూరిటీ ఫీచర్స్‌ను పరీక్షిస్తున్నారు. మరో రెండు రోజుల్లో సీఎం భద్రతా విభాగపు పోలీసుల ఈ టెక్నాలజీని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.
సీఎం ఇంటి దగ్గరకు వెళ్లే రహదారిపై అక్కడక్కడ చెక్ పోస్టులు ఉన్నాయి. క్యాంపు కార్యాలయం వద్ద కూడా పోలీసులు నిరంతరం పహారా కాస్తుంటారు. కానీ ఇప్పుడు చెక్ పోస్టులు, ఇతర తనిఖీలు లేకుండా బొల్లార్డ్స్, టైర్ కిల్లర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 45 సీసీ కెమెరాలతో నిఘా ఉండగా.. దానిని 65కి పెంచారు. దీంతో రోడ్లపై చెక్ పోస్టులు కనిపించకుండా.. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో సీఎం జగన్ ఇంటికి సెక్యూరిటీ అందించనున్నారు.
సీఎం నివాసం వద్ద భద్రతను పెంచాలని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో గతంలో సిబ్బందిని పెంచారు. అయితే పోలీసుల సంఖ్య పెరుగుతుండటంతో రాకపోకలకు సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారింది. అందుకే రూ. 2 కోట్లతో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. బొల్లార్డ్స్, టైర్ కిల్లర్స్ ఏర్పాటు కాంట్రాక్టును ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈ కంపెనీ సెక్యూరిటీని అప్‌గ్రేడ్ చేయాల్సి ఉన్నది. అయితే కరోనా, రోడ్డు విస్తరణ పనుల కారణంగా పనులు ఆలస్యం అయ్యాయి.
తాజాగా భద్రతా పరికరాలన్నింటినీ ఇన్‌స్టాలేషన్ పూర్తవడంతో ట్రయల్ రన్ కొనసాగిస్తున్నారు. రెండు రోజుల్లో ఆ సంస్థ పరికరాలను పోలీసులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం ఇంటికి అత్యంత సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి ఉన్నది. మరోవైపు రైవస్ కాలువ ఉంది. ఇంకో వైపు ఇళ్లు ఉన్నాయి. దీంతో సీఎం ఇంటికి 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు, అల్లరి మూకల నుంచి రక్షణగా భారీ సంఖ్యలో పోలీసుల నిఘా ఉన్నది. దీని వల్ల సమీపంలోని నివాసం ఉంటున్న వారికి ఇబ్బందికరంగా మారింది.
స్థానికులు పడుతున్న ఇబ్బందులు సీఎం జగన్ దృష్టికి వచ్చాయి. అందుకే ఈ అత్యాధునిక నిఘా వ్యవస్థ ద్వారా పోలీసుల బలగాల సంఖ్య తగ్గించే అవకాశం ఉన్నది. దీంతో స్థానికుల రాకపోకలకు కూడా ఆటంకం ఉండదని.. ఇలాంటి భద్రత దేశంలో మరే సీఎంకు లేదని అధికారులు చెబుతున్నారు.