Telugu Global
Andhra Pradesh

ఒకటో తేదీ నిరాశ.. 3వతేదీ నుంచి సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ

గతంలోవాలంటీర్లు అందుబాటులో లేకపోతే పెన్షన్ల పంపిణీ బాధ్యత వెల్ఫేర్ అసిస్టెంట్ లు తీసుకునేవారు. ఈసారి మాత్రం సచివాలయ సిబ్బంది అందర్నీ ఇందులో భాగస్వాముల్ని చేయబోతున్నారు.

ఒకటో తేదీ నిరాశ.. 3వతేదీ నుంచి సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ
X

ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలయ్యేది. ఉదయం ఆరు గంటలనుంచే వాలంటీర్లు అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆయా ఫొటోలను వాట్సప్ గ్రూప్ లలో అప్ లోడ్ చేస్తారు. కానీ ఈ నెల ఆ సందడి లేదు. ఇంకా చెప్పాలంటే రెండు రోజులపాటు అవ్వాతాతల చేతికి పెన్షన్లు అందవు. ఈనెల 3వతేదీన పంపిణీ మొదలవుతుంది, అది కూడా సచివాలయాల్లోనే. లబ్ధిదారులంతా తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడ పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

రెండు రోజుల ఆలస్యం ఎందుకంటే..?

ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని వారం క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కూడా ఏప్రిల్‌లో మూడో తేదీ నుంచే పెన్షన్లు పంపిణీ చేశారు. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో.. మూడో తేదీ నుంచి సచివాలయాల్లోనే పెన్షన్లు పంపిణీ చేసేందుకు సెర్ప్ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సచివాలయ సిబ్బందితోనే..

గతంలోవాలంటీర్లు అందుబాటులో లేకపోతే పెన్షన్ల పంపిణీ బాధ్యత వెల్ఫేర్ అసిస్టెంట్ లు తీసుకునేవారు. కానీ ఈసారి మాత్రం సచివాలయ సిబ్బంది అందర్నీ ఇందులో భాగస్వాముల్ని చేయబోతున్నారు. మూడో తేదీ నుంచి సచివాలయం స్టాఫ్ అంతా పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలి. సచివాలయాల వద్ద బయోమెట్రిక్‌, ఐరిస్ గుర్తింపు పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈసారి పెన్షన్లు పంపిణీ చేసే సమయంలో ఎలాంటి పబ్లిసిటీ ఉండకూడదు. ఫోటోలు, వీడియోలు తీయకూడదు. ఎన్నికల కోడ్‌ లోని నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కోడ్ అమలులో ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో నగదు వెంట ఉంచుకునే విషయంలో కూడా సచివాలయ సిబ్బంది నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పెన్షన్లకోసం బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేయడం.. తదితర వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు ఇచ్చే ధృవీకరణ పత్రాలను సచివాలయ సిబ్బంది తమ వద్ద ఉంచుకోవాలి. ఈ నియమాలన్నీ ఎన్నికల కోడ్ ముగిసే వరకు, అంటే జూన్ నెల పెన్షన్ల పంపిణీ పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయి.

First Published:  1 April 2024 1:21 AM GMT
Next Story