పవన్ కల్యాణ్‌కు తలనొప్పి.. తిరుపతిలో ‘ఆరణి’ చిచ్చు
చిత్తూరులో ఆరణి శ్రీనివాసులు అక్రమాలపై, అవినీతిపై నారా లోకేష్ సహా చంద్రబాబు ఆరోపణలు చేశారని వారు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కోసం తాము పనిచేయడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు.
వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరి తిరుపతి సీటు దక్కించుకున్న ఆరణి శ్రీనివాసులుకు వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును తిరుపతి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు.
ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ జనసేన, టీడీపీ నాయకులు గురువారం సమావేశమయ్యారు. తిరుపతిలో ఎవరు పోటీ చేసినా పని చేయాల్సింది తామేనని వారన్నారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తే తాము పనిచేస్తామని, లేదంటే స్థానికుడికి తిరుపతి టికెట్ కేటాయించాలని, ఆరణి శ్రీనివాసులుకు మాత్రం తాము సహకరించబోమని వారు చెప్పారు.
చిత్తూరులో ఆరణి శ్రీనివాసులు అక్రమాలపై, అవినీతిపై నారా లోకేష్ సహా చంద్రబాబు ఆరోపణలు చేశారని వారు గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కోసం తాము పనిచేయడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. ఆరణి శ్రీనివాసులును తిరుపతిలో అడుగు పెట్టనివ్వబోమని వారు హెచ్చరించారు.
తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఆరణి శ్రీనివాసులు గోబ్యాక్ అంటూ ఆయన ఫొటోతో ముద్రించిన ఫ్లెక్సీలు వెలిశాయి. శుక్రవారం తిరుపతిలో ఉదయం 10 గంటలకు టీడీపీ, జనసేన స్థానిక నేతలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనాలని వారు బీజేపీ నేతలను కూడా ఒప్పిస్తున్నారు.