చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలైందా?
రెండురోజుల క్రితమే టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ఇంద్రకీలాద్రిపైన ఉన్న దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. కన్నా గుంటూరు నుండి విజయవాడకు చేరుకున్న దగ్గర నుండి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, తర్వాత మీడియాతో మాట్లాడటం వరకు ఎంపీ కేసినేని నాని వ్యతిరేకులే ఆయన పక్కనున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరిక వల్ల చంద్రబాబు నాయుడుకు కొత్త తలనొప్పి మొదలైనట్లయ్యింది. విషయం ఏమిటంటే కన్నా పార్టీలో చేరటంతోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యతిరేక వర్గంతో రాసుకుపూసుకుని తిరుగుతున్నారు. రెండురోజుల క్రితమే పార్టీలో చేరిన కన్నా శుక్రవారం ఇంద్రకీలాద్రిపైన ఉన్న దుర్గమ్మ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కన్నా గుంటూరు నుండి విజయవాడకు చేరుకున్న దగ్గర నుండి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, తర్వాత మీడియాతో మాట్లాడటం వరకు ఎంపీ వ్యతిరేకులే పక్కనున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానితో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, సీనియర్ నేత నాగూల్ మీరాకు ఏమాత్రం పడటంలేదన్న విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు బూతులు తిట్టుకుని చివరకు కొట్టుకునే వరకు దిగజారిపోయింది పరిస్థితి. వీళ్ళమధ్య సర్దుబాటు చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాక చివరకు వదిలేశారు. ఇలాంటి నేపథ్యంలోనే ముగ్గురు నేతలకు ఎంపీ సోదరుడు కేశినేని చిన్నా అలియాస్ శివధర్ కూడా తోడయ్యారు.
ఇప్పుడు కన్నా పక్కన పై నేతలే కనిపించారు. బోండా కనిపించలేదు కానీ మిగిలిన ముగ్గురు నేతలు మాత్రం కన్నాతోనే ఉన్నారు. అంటే పార్టీలో చేరటం చేరటమే ఎంపీ వ్యతిరేకులతో కన్నా చేతులు కలిపినట్లయ్యింది. నిజంగా ఈ కొత్త పరిణామం చంద్రబాబుకు తలనొప్పులు పెంచేదే అనటంలో సందేహంలేదు. తన వ్యతిరేకులతో కన్నా చేతులు కలపటాన్ని ఎంపీ ఎలాగూ సహించరు.
గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఎలాగూ కన్నాను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి కన్నాను వ్యతిరేకిస్తున్న రాయపాటితో ఎంపీ కేసినేని నాని చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరులో కన్నా వ్యతిరేక గ్రూపు కార్యకలాపాలు మొదలవుతాయి. అంటే ఇటు విజయవాడలో అటు గుంటూరులో పార్టీకి నష్టం తప్పదు. పార్టీలో చేరిన కన్నా తన పాటికి తానుండకుండా కేసినేని నాని వ్యతిరేకులతో చేతులు కలపటం వల్ల చంద్రబాబుకు తలనొప్పులు మరింత పెరగటం మాత్రం ఖాయం.