ఏపీ క్యాబినెట్‌లో కులాల లెక్కలు.. టీడీపీకి తలనొప్పులు
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీని మోశామని తమకు మంత్రి పదవులివ్వాలన్నది సీనియర్ల డిమాండ్. ఆ చివర శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడి నుంచి ఈ చివర అనంతపురంలో ఉన్న పరిటాల సునీత వరకు సీనియర్లందరిదీ ఇదే మాట.
ఎన్నికలయిపోయాయి. కేంద్ర మంత్రివర్గమూ కొలువుదీరింది. ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి బుధవారమే ముహూర్తం. నేడు కూటమి నేతను ఎన్నుకునే లాంఛనప్రాయ సమావేశం. దీనిలో చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకుంటారు. అయితే మంత్రివర్గంలోకి ఎవర్ని తీసుకోవాలనే అంశంలో చంద్రబాబుకు తలనొప్పులు తప్పేలా లేవు. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీలకు కూడా క్యాబినెట్లో వాటా ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో బాబుకు మంత్రివర్గ కూర్పు కత్తి మీద సామే.
ఎవరి లెక్కలు వారివే
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పార్టీని మోశామని తమకు మంత్రి పదవులివ్వాలన్నది సీనియర్ల డిమాండ్. ఆ చివర శ్రీకాకుళంలో ఉన్న అచ్చెన్నాయుడి నుంచి ఈ చివర అనంతపురంలో ఉన్న పరిటాల సునీత వరకు సీనియర్లందరిదీ ఇదే మాట. పార్టీలో యువ రక్తానికి అవకాశమిస్తామని అధినేత చంద్రబాబు, లోకేష్ చెప్పారని తమకు మంత్రి పదవులిస్తారని తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త ఎమ్మెల్యేలు కొందరికైనా మంత్రి పదవులివ్వడం తప్పేలా కనిపించడం లేదు.
కుల సమీకరణాలు.. ప్రాంతాల లెక్కలు
పార్టీకి ముందు నుంచీ వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు ఈసారి భారీ విజయం నేపథ్యంలో ఎక్కువ మంత్రి పదవులివ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. యాదవుల నుంచి పుట్టా సుధాకర్‌యాదవ్, యనమల రామకృష్ణుడు, ఆయనకు దక్కని పక్షంలో ఆయన కుమార్తె యనమల దివ్య మంత్రి పదవి ఆశిస్తున్నారు. గోదావరి జిల్లా బీసీల్లో భారీ సంఖ్యలో ఉన్న శెట్టిబలిజల నుంచి పితాని సత్యనారాయణ, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ పోటీపడుతున్నారు. గౌడ (ఈడిగ)ల నుంచి తనకు ఖాయమన్నది పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ధీమా. తండ్రి కేఈ కృష్ణమూర్తి వారసత్వం ఇక్కడ కలిసిరావచ్చంటున్నారు. తూర్పు కాపుల నుంచి బండారు సత్యనారాయణ, కిమిడి కళా వెంకట్రావు లాంటి సీనియర్లు రేసులో ఉన్నారు.
మత్స్యకారులకు చోటుపై మల్లగుల్లాలు
మత్స్యకార సామాజికవర్గం నుంచి కొల్లు రవీంద్ర, కాకినాడ సిటీలో గెలిచిన వనమాడి కొండబాబు నాకంటే నాకు మంత్రి పదవి అంటున్నారు. ఇదే సామాజికవర్గం నుంచి జనసేన తరఫున నరసాపురం నుంచి గెలిచిన బొమ్మిడి నాయకర్‌కు మంత్రి పదవి కోసం ఆ పార్టీ పట్టుబట్టే అవకాశాలున్నాయి. నాయకర్‌కు ఇస్తే మత్స్యకార సామాజికవర్గం నుంచి టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యం లేకుండా పోతుంది. ఇస్తే మత్స్యకార సామాజికవర్గం నుంచే క్యాబినెట్‌లో రెండు పదవులు అయిపోతాయి. మిగతావారికి సరిపెట్టడం కష్టమవుతుందని టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది.