ఆ సాయం పెళ్లి కూతురికి కాదు, తల్లికి.. వైసీపీ ప్రభుత్వం ట్విస్ట్
పెళ్లి ఖర్చు సహజంగా తల్లిదండ్రులు పెట్టుకుంటారు. అంటే ఆర్థిక సాయం వారికి ఇస్తేనే కాస్త వెసులుబాటు ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు అధికారులు.
కల్యాణమస్తు పేరుతో ప్రభుత్వాలు పెళ్లి చేసుకుంటున్న పేదలకు, కులాంతర వివాహాలు చేసుకునే వారికి, వికలాంగులకు ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఏపీలో కూడా ఈ పథకం అమలులో ఉంది. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పేరుతో ఈ పథకాలు ఏపీలో అమలవుతున్నాయి. అయితే ఆర్థిక సాయం విషయంలో ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఇప్పటి వరకూ ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు అకౌంట్ లో జమ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ సాయాన్ని పెళ్లి కూతురు తల్లి అకౌంట్ లో వేస్తామని తేల్చి చెప్పారు. పెళ్లి కూతురికి తల్లి లేని సందర్భాల్లో తండ్రి, లేదా అన్నదమ్ముల అకౌంట్లలో ఆర్థిక సాయం జమచేస్తారు.
ఎందుకిలా..?
పెళ్లి ఖర్చు సహజంగా తల్లిదండ్రులు పెట్టుకుంటారు. అంటే ఆర్థిక సాయం వారికి ఇస్తేనే కాస్త వెసులుబాటు ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు అధికారులు. ఇకపై వైఎస్సార్ కల్యాణ మస్తు, షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురి తల్లి అకౌంట్లోనే జమ చేస్తామంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ నిధులు విడుదలయ్యాయి, ఇకపై వీటిని పెళ్లికూతురి తల్లి అకౌంట్లో వేస్తారు. దీనికోసం మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే ప్రేమ వివాహాలు చేసుకుని వేరు కుటుంబాలు వెళ్లిన వారు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటే మినహాయింపు ఉంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. పేద కుటుంబాల వారికే ఈ సాయం చేస్తారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి లక్షా 20 వేల రూపాయలు, దివ్యాంగులకు రూ.1.5 లక్షలు ప్రోత్సాహకంగా అందిస్తారు. పెళ్లి అయిన 60 రోజుల్లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత అధికారులు దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హుల జాబితా ప్రకటిస్తారు. వారందరికీ ఒకేసారి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.