క్రెడిట్ కార్డులతో మెడికల్ వ్యాపారి నయా మోసం...! - సిబిల్ స్కోరు పెరుగుతుందంటూ నమ్మించి.. నయవంచన
మొత్తం రూ.2 కోట్ల మేరకు మోసం జరిగినట్టు బాధితులు చెబుతున్నారు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితులు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
క్రెడిట్ కార్డు వాడుతూ ఉంటే.. సిబిల్ స్కోరు పెరుగుతుందని, తద్వారా బ్యాంకు రుణం ఎక్కువ మొత్తంలో పొందవచ్చని నమ్మించాడు. తన వ్యాపారం నిమిత్తం క్రెడిట్ కార్డులు కావాలని చెప్పి దరఖాస్తు చేయించాడు. ఆపై ఆ కార్డులు తన వద్దే ఉంచుకొని రూ.లక్షల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించేవాడు. చివరికి బిచాణా సర్దేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మొత్తం రూ.2 కోట్ల మేరకు మోసం జరిగినట్టు బాధితులు చెబుతున్నారు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితులు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనలో నిందితుడు విజయవాడ భవానీపురానికి చెందిన జి.కార్తీక్. దుర్గాపురం సాంబమూర్తి రోడ్డులో శ్రీ ధనలక్ష్మి మెడికల్ అండ్ ఫ్యాన్సీ డిస్ట్రిబ్యూటర్‌గా అతను 15 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాడు. తన దుకాణం వద్దకు వచ్చేవారితో పరిచయం పెంచుకున్నాడు. బంధువులు, స్నేహితులతోనూ మంచిగా ఉంటూ అందరితోనూ పరిచయాలు కంటిన్యూ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన వ్యాపారం నిమిత్తం క్రెడిట్ కార్డు అవసరమని వారిని నమ్మించి, వారితో దరఖాస్తు చేయించాడు. వాటిని తన వద్దే ఉంచుకొని లక్షల్లో రుణాలు తీసుకుంటూ.. అవసరమైనవారికీ రుణాలు ఇప్పిస్తూ రొటేషన్ చేస్తున్నాడు.
మోసం బయటపడిందిలా...
రెండు మూడు నెలలుగా కార్తీక్ బ్యాంకు రుణాలకు వాయిదాలు సక్రమంగా చెల్లించడం లేదు. ఈ విషయం గమనించిన కార్డుదారులు అదేమని అడిగితే.. వ్యాపారాన్ని విస్తరించానని, అప్పులయ్యాయని, భయపడాల్సింది లేదని, మొత్తం చెల్లించేస్తానని నమ్మించాడు. దీంతో ఊరుకున్న బాధితులకు అతను నెల రోజులుగా చెల్లింపులు పూర్తిగా నిలిపివేయడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో పాటు తెలిసినవారి నుంచి అప్పులు కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు. దీనిపై ఒకరిద్దరు నిలదీయగా.. గత నెల 30 నాటికి మొత్తం బకాయిలు చెల్లించేస్తానని, తనకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మించాడు. ఆ తర్వాత అతని సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు అతని కోసం వెతకగా, ఇల్లు, షాపులోని సామగ్రి మొత్తం గుట్టుచప్పుడు కాకుండా తరలించేశాడని తేలింది. బంధువులను ఆరా తీయగా వారూ తమకేమీ తెలియదని చెప్పడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
చీటీ పాడించి మరీ..
తమ షాపు ముందు ఉండే కృష్ణకుమారి అనే మహిళ రూ.10 లక్షలు చీటీ వేసినట్టు తెలుసుకున్న కార్తీక్ తనకు వ్యాపార నిమిత్తం అవసరమంటూ చీటీ కూడా పాడించి రూ.7 లక్షలు వసూలు చేసినట్టు బాధితురాలు పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని చెబితే.. జనవరిలో తాను చేయిస్తానని చెప్పాడని ఆమె లబోదిబోమంటోంది. తమ ఇంటి ముందు షాపు కావడంతో మంచిగా మాట్లాడేవాడని నమ్మానని ఆవేదన చెందుతోంది.
దూరపు బంధువు కార్డుతో.. రూ.30 లక్షల పైనే రుణం..
షాపులకు తిరిగి చిప్స్ అమ్ముకుంటూ రోజుకు రూ.500 సంపాదించుకునే సాయి వద్ద తీసుకున్న క్రెడిట్ కార్డుతో రూ.30 లక్షల పైనే రుణం తీసుకున్నట్టు బాధితుడు వెల్లడించాడు. దూరపు బంధువని నమ్మితే వంచించాడని బాధితుడు నెత్తీనోరూ బాదుకుంటున్నాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసినవారిలో 12 మంది ఉండగా, మరో 10 మంది బాధితులు ఉన్నట్టు సమాచారం. మొత్తం రూ.2 కోట్ల మేరకు మోసగించినట్టు తెలుస్తోంది. సూర్యారావుపేట సీఐ జానకిరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.