సంఘం గుర్తింపే రద్దవుతుంది.. సూర్యనారాయణకు బండి హెచ్చరిక
ఉద్యోగ సంఘాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే సంఘాల గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని బండి శ్రీనివాస్ హెచ్చరించారు. ఎన్‌జీవో సంఘం నేతలు సీఎం మెప్పు కోసం పనిచేస్తున్నారని సూర్యనారాయణ అనడానికి ఖండించారు.
ఏపీ ఉద్యోగ సంఘాల నేతల మధ్య కొత్త వివాదం తలెత్తింది. ఇతర సంఘాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ నేరుగా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడాన్ని ఇతర సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ బహిరంగంగానే సూర్యనారాయణ తీరును తప్పుపట్టారు.
సంక్రాంతికి ఇవ్వాల్సిన డీఏలను వెంటనే చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పారని.. వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో జీవో జారీ ఆలస్యం అయిందని.. అంతలోనే గవర్నర్‌ను కలిసి కొందరు ఫిర్యాదు చేయడం సరికాదని బండి శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లిలో సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో బండి శ్రీనివాస్ తదితరులు కలిశారు. సీఎం హామీ ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం తప్పని మీడియా ముందు బండి వ్యాఖ్యానించారు.
ఉద్యోగ సంఘాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే సంఘాల గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని బండి శ్రీనివాస్ హెచ్చరించారు. ఎన్‌జీవో సంఘం నేతలు సీఎం మెప్పు కోసం పనిచేస్తున్నారని సూర్యనారాయణ అనడానికి ఖండించారు. సమస్యలపై ఏపీఎన్‌జీవో సంఘం ఏనాడు రాజీ పడలేదన్నారు. సూర్యనారాయణ వెనుక ఏదో శక్తి ఉండి నడిపిస్తోందని దీన్ని ఉద్యోగులంతా గమనిస్తున్నారని బండి శ్రీనివాస్ ఆరోపించారు.
తన ఉద్యోగ సంఘానికి సూర్యనారాయణ తప్పుడు మార్గంలో గుర్తింపు తెచ్చుకున్నారని కూడా బండి ఆరోపించారు. ఎన్‌జీవో సంఘాన్ని అవహేళన చేయడం మానుకోవాలన్నారు.