రేపు ప్రజలను కూడా తరిమేస్తారా?
తన నిర్ణయంతో విభేదించే నేతలను కూర్చోబెట్టి టీడీపీతో పొత్తు ఎందుకు అవసరమో చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత పవన్‌దే. అంతేకానీ తన నిర్ణయాలు నచ్చనివాళ్ళు పార్టీలో నుండి వెళ్ళిపొమ్మనటంలోనే పవన్‌లోని నియంత లక్షణం బయటపడింది.

పొద్దున లేచింది మొదలు జగన్మోహన్ రెడ్డిని నియంత, ఫ్యాక్షనిస్ట్ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తుంటారు. అయితే పార్టీ సమావేశంలో నేతలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు నియంతను తలపిస్తున్నాయి. పవన్ మాట్లాడినట్లుగా ఇప్పటివరకు పార్టీ నేతలతో జగన్ ఎప్పుడూ ఇలా మాట్లాడింది లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవటాన్ని పవన్ సమర్థించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగా ఉన్నాయి.
టీడీపీ-జనసేన పొత్తు ఇష్టంలేనివాళ్ళు పార్టీని వదిలేసి వైసీపీలో చేరాలని చెప్పారు. తన నిర్ణయాలను ప్రశ్నించేవారు ఎవరూ పార్టీలో ఉండాల్సిన అవసరంలేదని స్పష్టంగా హెచ్చరించారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నపుడే పార్టీలోని నేతలు తనను ప్రశ్నించటాన్ని పవన్ తట్టుకోలేకపోతున్నారు. అలాంటిది రేపు అధికారంలోకి వస్తే ఇంకెలా వ్యవహరిస్తారు అనే చర్చ పెరిగిపోతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు నచ్చని జనాలను రాష్ట్రం వదిలి వెళ్ళిపొమ్మంటారేమో అని సెటైర్లు పెరిగిపోతున్నాయి.
ప్రజాస్వామ్యం పద్ధతిలో పార్టీని నడపలేని వ్యక్తి పార్టీ ఎందుకు పెట్టినట్లు? అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చినట్లు అని జనాలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. పార్టీలోని నేతలనే కన్వీన్స్ చేయలేని పవన్ ఇక జనాలను ఏం కన్వీన్స్ చేస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నిస్తున్నారు. పవన్ మాటల్లో ఒక వాస్తవం బయటపడిందట. అదేమిటంటే టీడీపీ-జనసేన పొత్తు పార్టీలోని చాలామందికి ఇష్టంలేదని. ఈ విషయాన్ని పవన్ మాటల్లోనే బయటపడింది.
టీడీపీతో పొత్తు పెట్టుకోవటం ఇష్టంలేనివాళ్ళు పార్టీలో నుండి బయటకు వెళ్ళిపోవాలని స్వయంగా పవనే అన్నారంటే అర్థమేంటి? టీడీపీతో పొత్తు పెట్టుకోవటం పార్టీలోని నేతలకు ఇష్టంలేదనే కదా. తన నిర్ణయంతో విభేదించే నేతలను కూర్చోబెట్టి టీడీపీతో పొత్తు ఎందుకు అవసరమో చెప్పి వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత పవన్‌దే. అంతేకానీ తన నిర్ణయాలు నచ్చనివాళ్ళు పార్టీలో నుండి వెళ్ళిపొమ్మనటంలోనే పవన్‌లోని నియంత లక్షణం బయటపడింది. పార్టీలో తానే నియంతలా వ్యవహరిస్తూ మళ్ళీ జగన్‌ను నియంతని ఆరోపించటం ఏమిటో అర్థంకావటంలేదు.
♦