Telugu Global
Andhra Pradesh

జగన్‌పై దాడి.. ముందు సెటైర్.. ఆ తర్వాత ఖండన - నాగబాబుపై నెటిజన్ల ఫైర్

నాగబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఖండించడం అటుంచి.. విమర్శలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నించారు.

జగన్‌పై దాడి.. ముందు సెటైర్.. ఆ తర్వాత ఖండన - నాగబాబుపై నెటిజన్ల ఫైర్
X

విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై నిన్న రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై తీవ్ర గాయమైంది. ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహా పలు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఖండించారు. కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన మాత్రం తమపై తామే దాడి చేసుకుని వైసీపీ డ్రామాలాడుతోందని విమర్శలు చేశాయి.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిపై జరిగిన దాడిపై జనసేన నాయకుడు నాగబాబు నిన్న రాత్రే స్పందించారు. జగన్‌పై దాడి జరగడాన్ని ఒక డ్రామాగా నాగబాబు అభివర్ణించారు. జగన్‌పై సెటైర్ వేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్.. అసలు స్క్రిప్ట్ లా అనిపించట్లేదు' అని ట్వీట్ చేశారు. అయితే నాగబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఖండించడం అటుంచి.. విమర్శలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నించారు.

జగన్‌పై దాడి నిన్న రాత్రి జరుగగా.. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇవాళ ఉదయం పలు రాష్ట్రాల నాయకులు ఈ ఘటనను ఖండించారు. ప్రధాని మోడీ కూడా జగన్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. దీంతో నాగబాబు నిన్న రాత్రి జగన్‌పై సెటైర్ వేస్తూ చేసిన ట్వీట్‌ని ఉదయం డిలీట్ చేశారు. దాని స్థానంలో మరో ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి అప్రజాస్వామిక చర్య అని నాగబాబు అన్నారు. జగన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రత్తి విమర్శలు ఉండొచ్చు కానీ ఇలాంటి భౌతికమైన దాడులు హేయమైన చర్య అని, చట్టరీత్యా నేరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని నాగబాబు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ముందు జగన్‌పై జరిగిన దాడిపై సెటైర్లు వేసి.. ఆ తర్వాత ఖండించడంపై నెటిజన్లు నాగబాబుపై ఫైర్ అవుతున్నారు. ఈ బుద్ధి ముందు ఏమైందని పలువురు నాగబాబును ప్రశ్నించారు.

First Published:  14 April 2024 3:13 PM IST
Next Story