పవన్‌పై నెటిజన్లు ఫైర్
రుషికొండపైన నిర్మాణాల సంగతిని పక్కనపెట్టేస్తే చుట్టు పక్కల కొండలపైన ఎప్పటినుండో భారీ భవంతులున్న విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటన విషయంలో నెటిజన్లు ఫుల్లుగా ఫైరవుతున్నారు. రూట్ మ్యాప్ ఇచ్చిన ప్రకారం కాకుండా సడెన్‌గా పవన్ రుషికొండను సందర్శించారు. పోలీసులు అభ్యంతరం చెబుతున్నా లెక్కచేయలేదు. పవన్‌తో పాటు వేలాది మంది అభిమానులున్న కారణంగా ఏమిచేయలేక పోలీసులు కూడా వదిలేశారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే రుషికొండలో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నారని, కొండను తొలిచేయటం వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతోందని నానా గోల చేశారు.
దీనిపైనే నెటిజన్లు పవన్‌ను ఫుల్లుగా వాయించేశారు. రుషికొండలో నిర్మాణల కారణంగా పర్యావరణ విధ్వంసం జరుగుతుందని చెబుతున్న పవన్‌కు అమరావతిలో రాజధానిని నిర్మాణం పేరుతో చంద్రబాబు చేసిన విధ్వంసం గుర్తుకురాలేదా అని నిలదీస్తున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే పొలాలను, భూములను చంద్రబాబు లాక్కున్నపుడు పవన్ ఎందుకు అడ్డుపడలేదని ప్రశ్నిస్తున్నారు. రాజధానికి భూములు ఇవ్వని రైతుల పంటలను చంద్రబాబు ప్రభుత్వం తగలబెట్టించినప్పుడు పవన్‌కు పర్యావరణ విధ్వంసం కనబడలేదా అని అడిగారు.
అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టకూడదని శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదిక పవన్‌కు తెలీదా అని అడిగారు. నివేదికలోని అంశాలకు విరుద్ధంగా చంద్రబాబు అమరావతిని నిర్మించాలని అనుకున్నప్పుడు పవన్ ఎందుకు అడ్డుపడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రుషికొండపైన నిర్మాణాల సంగతిని పక్కనపెట్టేస్తే చుట్టు పక్కల కొండలపైన ఎప్పటినుండో భారీ భవంతులున్న విషయాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. రుషికొండ మీదే ఎప్పుడో నిర్మించిన టూరిజం ప్లాజా ఉందన్న విషయం పవన్‌కు తెలుసా అని నిలదీస్తున్నారు.
రుషికొండ మీద జగన్ కాకుండా చంద్రబాబు నిర్మాణాలు చేసుంటే పవన్ అసలు నోరెత్తుండేవారు కాదని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు నివాసముంటున్న కరకట్ట అక్రమ నిర్మాణంకు వెనుకే టీడీపీ నేతలు కృష్ణా నదిలో ఇసుకను తవ్వేస్తే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్లు జరిమానా వేసిన విషయాన్ని పవన్‌కు గుర్తుచేశారు. రుషికొండలో ఇప్పుడు జరుగుతున్న నిర్మాణం జగన్ ఇల్లుకాదని ముఖ్యమంత్రి కార్యాలయం అని పవన్‌కు తెలీదా? అని ఎద్దేవా చేశారు.