Telugu Global
Andhra Pradesh

ఇదేం ఖర్మ అంటున్న నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే..

ఈ కష్టాలను మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్లామని మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ హామీ కూడా ఇచ్చారని, ఏడాదవుతున్నా హామీ అమలు కాలేదు కానీ, మంత్రిగారి శాఖ మారిపోయిందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే.

ఇదేం ఖర్మ అంటున్న నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే..
X

ఇది టీడీపీ స్లోగన్ కదా, వైసీపీ ఎమ్మెల్యేకి ఏం సంబంధం అనుకుంటున్నారా. అవును, ఆయన కూడా ఇదేం ఖర్మ అనేశారు. నెల్లూరు జిల్లా అధికారుల తీరుపై మండిపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలను జిల్లా సమీక్షా సమావేశంలో ఏకరువు పెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ప్రజలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారని అన్నారు. అధికారుల తీరుతో తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామని చెప్పారు.

మంత్రిగారు మారినా సమస్య తీరలేదు..

నెల్లూరులో గత ప్రభుత్వ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ ఏర్పాటు పేరుతో రోడ్లు అడ్డదిడ్డంగా తవ్వేశారు. ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు ఇలాంటి పనులు పెట్టుకోవడం, అవి సకాలంలో పూర్తి కాకపోవడంతో నెల్లూరు సిటీకి పోటీ చేసిన అప్పటి మంత్రి నారాయణ ఓడిపోడానికి కూడా ఇది పరోక్ష కారణం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెల్లూరులో అంతర్గత రోడ్ల మరమ్మతులు పూర్తి కాలేదు. అది నగర కార్పొరేషన్ పరిధిలో లేకపోవడంతో వారు కూడా పట్టించుకోలేదు. ఈ కష్టాలను మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్లామని మంత్రి హోదాలో బొత్స సత్యనారాయణ హామీ కూడా ఇచ్చారని, ఏడాదవుతున్నా హామీ అమలు కాలేదు కానీ, మంత్రిగారి శాఖ మారిపోయిందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే.

కాకాణి మైండ్ బ్లాక్..

జిల్లా మంత్రిగా సమీక్ష సమావేశంలో కూర్చున్న కాకాణి గోవర్దన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే మాటలకు షాకయ్యారు. ఆయన చెబుతోంది అక్షరాలా నిజం, అందులోనూ పక్క నియోజకవర్గం, మంత్రి సొంత నియోజకవర్గమైన సర్వేపల్లి సమస్యలను కూడా ప్రస్తావించడంతో కాకాణికి ఏం చేయాలో పాలుపోలేదు. అధికారుల్ని నిలదీసినా వారు నీళ్లు నమిలారు. రోడ్లు వేయడంలేదని, ధ్వంసం అయినా పట్టించుకోలేదని, ఫ్లైఓవర్లు కట్టాల్సి ఉన్నా నిధులు మంజూరు కాలేదని అధికారులు దాటవేస్తున్నారని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. మొత్తమ్మీద.. స్వపక్షంలో విపక్షంలా తమ ప్రభుత్వ వైఫల్యాలను తానే బయటపెట్టారు శ్రీధర్ రెడ్డి. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రోడ్ల దుస్థితి చూసి రూరల్ ప్రజలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారంటూ ఆయన అన్న మాటల్ని టీడీపీ నేతలు హైలెట్ చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతలు చేస్తే.. అసత్య ఆరోపణలు అని కొట్టిపారేసేవారు. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే విమర్శలు చేయడంతో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

First Published:  23 Dec 2022 10:13 AM GMT
Next Story