Telugu Global
Andhra Pradesh

సవాళ్లు, హెచ్చరికలు: నెల్లూరులో పొలిటికల్ వార్

కోటంరెడ్డికి డబ్బు పిచ్చి ఎక్కువైందని, మూడున్నరేళ్లుగా నెల్లూరులో ఆయన అరాచకం సృష్టించారని మండిపడ్డారు ఆదాల. ఆయన చరిత్ర అందరికీ తెలుసని, రూరల్ లో కోటంరెడ్డి గుట్టు విప్పుతానంటూ హెచ్చరించారు.

సవాళ్లు, హెచ్చరికలు: నెల్లూరులో పొలిటికల్ వార్
X

ఫోన్ ట్యాపింగ్ తో మొదలైన నెల్లూరు పొలిటికల్ హడావిడి ఇప్పుడు సవాళ్లు, ప్రతిసవాళ్లు, హెచ్చరికల వరకు చేరుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ తీసుకుని, చివర్లో వైసీపీలో చేరిన ఆదాల.. పెళ్లిపీటలపై నుంచి పారిపోయిన పెళ్లికొడుకంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తేల్చి చెప్పాలన్నారు. అరగంట గ్యాప్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆదాల, కోటంరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తానే రూరల్ లో వైసీపీ తరపున బరిలో దిగుతానంటూ సవాల్ విసిరారు. కోటంరెడ్డికి డబ్బు పిచ్చి ఎక్కువైందని, మూడున్నరేళ్లుగా నెల్లూరులో ఆయన అరాచకం సృష్టించారని మండిపడ్డారు ఆదాల. ఆయన చరిత్ర అందరికీ తెలుసని, రూరల్ లో కోటంరెడ్డి గుట్టు విప్పుతానంటూ హెచ్చరించారు. కోటంరెడ్డి వేధింపుల గురించి చాలామంది బయటకొస్తారని చెప్పుకొచ్చారు.

లేఖలు కాదు, కోర్టులో కేసు వెయ్..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డి కేంద్రానికి లేఖ రాశానంటున్నారని, కానీ ఆయన కోర్టులో కేసు వేయాలని సలహా ఇచ్చారు మంత్రి కాకాణి. కోర్టులో కేసు వేస్తే దాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత కోటంరెడ్డిపై ఉంటుందని, ఆయన ఫోన్ కూడా కోర్టుకి ఇవ్వాల్సి వస్తుందని, అందుకే ఆయన కోర్టుల జోలికి వెళ్లడం లేదని ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి విషయంలో జరిగింది ఫోన్ ట్యాప్ కాదని, చంద్రబాబు ట్రాప్ అని మరోసారి స్పష్టం చేశారు మంత్రి కాకాణి. శ్రీధర్‌ రెడ్డి అబద్ధాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. అండగా నిలిచిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేశారని, ఆయనకు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. వాపును చూసి బలమనుకుని కోటంరెడ్డి భ్రమపడుతున్నాడని కౌంటర్ ఇచ్చారు.

కోటంరెడ్డి బలప్రదర్శన..

అంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, తన బలం ఇదీ అంటూ 11మంది కార్పొరేటర్లతో మాట్లాడించారు. మేయర్ సహా కార్పొరేటర్లు తమవైపే ఉన్నారని చెప్పుకొచ్చారు. మిగతావారు కూడా బిల్లులకోసం వైసీపీలోనే ఉన్నారని, వారు కూడా చివర్లో తనవైపే వచ్చేస్తారని అన్నారు. తన స్నేహితుడితో ప్రెస్ మీట్ పెట్టించి ఏదో సంచలనం సృష్టించామనుకుంటున్న ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందన్నారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి లేఖ రాయాలన్నారు.




First Published:  9 Feb 2023 12:44 PM IST
Next Story