కోటంరెడ్డికి పోటీగా ఆదాల.. రసవత్తరంగా నెల్లూరు రాజకీయం
ఇన్ చార్జ్ గా ప్రకటించడంతోపాటు 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఆదాలే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ఆదేశాల ప్రకారమే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని చెప్పారు.
ఒకరు పోతే ఇంకొకరు అన్నట్టుగా పగడ్బందీగా రాజకీయం నడుపుతున్నారు సీఎం జగన్. నెల్లూరులో రేగిన అలజడిని కాస్త కఠినంగానే అణచివేస్తున్నారు. వెంకటగిరిలో కాస్త ముందుగానే ఆనం రామనారాయణ రెడ్డికి పోటీగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని బరిలో దింపారు. ఆనం అధికారాలకు కత్తెరవేసి, నేదురుమల్లిని జనంలోకి వెళ్లమన్నారు. ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి విషయంలో మాత్రం మూడు రోజులపాటు తీవ్ర తర్జన భర్జన పడ్డారు. కోటంరెడ్డికి పోటీగా ఎవరిని ప్రకటించాలనే విషయంలో పలు చర్చలన అనంతరం ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఫైనల్ చేశారు. ఆనం సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు బీదా మస్తాన్ రావు పేర్లు కూడా వినిపించినా.. చివరకు ఆదాలను ఫైనల్ చేశారు. కోటంరెడ్డిని ఢీకొనడానికి ఆదాలే సరైన అభ్యర్థిని అని నిర్ణయించారు.
ఆదాలే అభ్యర్థి..
ఇన్ చార్జ్ గా ప్రకటించడంతోపాటు 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఆదాలే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అని కూడా స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ఆదేశాల ప్రకారమే ఆయన్ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇక నెల్లూరు రూరల్ లో వైసీపీ గెలుపు నల్లేరుపై నడక వంటిదని చెప్పారు మాజీ మంత్రి, జిల్లా పార్టీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసులరెడ్డి. ఆదాల తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారనే నమ్మకం పార్టీకి ఉందన్నారు.
ఆదాల అసెంబ్లీకి, మరి పార్లమెంట్ కి ఎవరు..?
ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాలను తీసుకొచ్చి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ప్రకటించారు. మరి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఎవరికి అవకాశం ఇస్తారనే ప్రశ్నలు అప్పుడే మొదలయ్యాయి. రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డ ప్రభాకర్ రెడ్డి లేదా, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆదాల కూడా ఈసారి అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. ఆయనకు అనుకోకుండా రూరల్ నియోజకవర్గ స్థానం ఇలా వరించింది. దీంతో సీట్ల సర్దుబాటు పక్కాగా సరిపోయింది.
ఇక రేపట్నుంచి ఆదాల నెల్లూరు రూరల్ లో పార్టీ బలోపేతం కోసం పనిచేయాల్సి ఉంటుంది. అయితే వైసీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు అంతా కోటంరెడ్డి వెంటే ఉన్నారని అంటున్నారు. వారిలో ఎంతమందిని ఆదాల తనవైపు తిప్పుకుంటారనేదానిపైనే వైసీపీ గెలుపు ఆధారపడి ఉంటుంది.