శృతి మించిన నెల్లూరు రాజకీయం.. పెద్ద నాయకుల మౌనం
మేయర్ ని తోటి కార్పొరేటర్లు అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గిరిజన మహిళకు అవమానం జరిగిందంటూ కోటంరెడ్డి వర్గం ఆ వీడియోలను వైరల్ చేసింది.
నెల్లూరు జిల్లాలో వైసీపీ అంతర్గత రాజకీయాలు మరోసారి రోడ్డునపడ్డాయి. నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ పొట్లూరి స్రవంతికి కొంతమంది కార్పొరేటర్లకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో తనను తోసేశారని మేయర్ ఆరోపిస్తున్నారు. తన చీర చిరిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. ఈరోజు జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేయబోతున్నారు. గిరిజన మహిళనైన తనను అవమానించారని, ఈ విషయాన్ని రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్తానన్నారు మేయర్. నెల్లూరులో ఇంత జరుగుతున్నా వైసీపీ పెద్ద తలకాయలేవీ స్పందించకపోవడం విశేషం.
నెల్లూరు నగర కార్పొరేషన్లో అన్ని స్థానాలు వైసీపీకే దక్కాయి. మేయర్ పీఠం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులకు వెళ్లింది. దీంతో సహజంగానే ఆమెపై వైరి వర్గం కస్సుబుస్సుమంటోంది. ఇటీవల కోటంరెడ్డి వైసీపీని వీడి బయటకు రావడం, ఆయనకు మద్దతుగా మేయర్ మాట్లాడటంతో ఈ గొడవ మరింత ముదిరింది. తాజాగా జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో సీఎం జగన్ ఫొటోపై రగడ జరిగింది. కౌన్సిల్ హాల్ లో జగన్ ఫొటో ఎవరు పెట్టారని మేయర్ ప్రశ్నించడంతో కార్పొరేటర్లు ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు. జగన్ దయతో గెలిచి మేయర్ పదవిలో కూర్చుని ఆయన ఫొటోని అవమానిస్తారా అని రెట్టించారు. మేయర్ ని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్కడ జరిగిన గొడవపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి.
మేయర్ ని తోటి కార్పొరేటర్లు అడ్డుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గిరిజన మహిళకు అవమానం జరిగిందంటూ కోటంరెడ్డి వర్గం ఆ వీడియోలను వైరల్ చేసింది. దీనికి ప్రతిగా వైసీపీతోనే ఉన్న కార్పొరేటర్లు కౌంటర్లిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో పెద్ద నాయకులెవరూ జోక్యం చేసుకోకపోవడం విశేషం. జిల్లా మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ ఘటనపై స్పందించలేదు. మేయర్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైనా వైసీపీలో అంతా మౌనాన్నే ఆశ్రయించారు.