నెల్లూరు వైసీపీలో ఆగని ప్రకంపనలు.. డిప్యూటీ మేయర్, నలుగురు కార్పొరేటర్లు రాజీనామా
డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు స్వయానా బాబాయ్. అయితే కొంతకాలంగా బాబాయ్, అబ్బాయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
నెల్లూరు వైసీపీలో ప్రకంపనలు ఆగడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లిపోయారు. తను కోరిన వారికి అసెంబ్లీ టికెట్లు కేటాయించడం లేదంటూ అలిగి రాజ్యసభ్య సభ్యుడు, నెల్లూరు లోక్‌సభ పార్టీ సమన్వయకర్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు అది మరింత కిందకి వెళ్లి నగరపాలక సంస్థ వరకు పాకింది. నెల్లూరు డిప్యూటీ మేయర్ పి. రూప్‌కుమార్ యాదవ్, నలుగురు కార్పొరేటర్లు, మరికొందరు మైనార్టీ కార్యకర్తలు ఈ రోజు వైసీపీకి రాజీనామా చేశారు.
మాజీ మంత్రి అనిల్‌కు బాబాయ్
డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు స్వయానా బాబాయ్. అయితే కొంతకాలంగా బాబాయ్, అబ్బాయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనిల్ కుమార్ యాదవ్‌కు మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
అసంతృప్తికి కారణమేంటి?
నెల్లూరు నుంచి నరసరావుపేట ఎంపీ స్థానానికి అనిల్‌కుమార్ యాదవ్‌ను పంపిన నేపథ్యంలో రూప్‌కుమార్ శాంతిస్తారని వైసీపీ భావించింది. కానీ ఈరోజు అనూహ్యంగాకొంతమంది కార్పొరేటర్లతో కలిసి ఆయన రాజీనామా చేశారు. రెండుసార్లు గెలిచిన అనిల్ కుమార్ వేరే స్థానంలో పోటీ చేస్తుండటం, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజీనామా, తాజాగా రూప్‌కుమార్ తదితరుల రాజీనామాతో నెల్లూరు నగరంలో వైసీపీకి వాతావరణం ఇబ్బందికరంగా మారుతున్నట్లేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.