టీడీపీకి ఆహ్వానం లేదు..
ఎన్డీఏ కూటమిలో టీడీపీ లేదని, ఆ పార్టీని ఎందుకు ఆహ్వానిస్తామని ప్రశ్నించారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్. తమతో కలసి పనిచేస్తున్న జనసేనకు ఆహ్వానం వెళ్లి ఉంటుందన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ ఏకమవుతుండే సరికి బీజేపీలో గుబులు పుట్టింది. ఎన్డీఏ కూటమిని పటిష్టపరిచే క్రమంలో ఈనెల 18న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మీటింగ్ పెట్టింది బీజేపీ. ఆ మీటింగ్ కి ఎన్డీఏ పాతమిత్రులంతా హాజరవుతారని అంటున్నారు. టీడీపీకి కూడా ఆహ్వానం వెళ్లిందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అయితే ఉన్నట్టుండి టీడీపీ గాలి తీసేశారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్. అసలు టీడీపీకి ఆహ్వానమే లేదని తేల్చేశారాయన.
జనసేనకు ఆహ్వానం..
సోషల్ మీడియా యూనివర్శిటీల్లో చాలా వార్తలు వస్తుంటాయని, వాటన్నిటికీ సమాధానం చెప్పలేమని అన్నారు మాధవ్. ఎన్డీఏ కూటమిలో టీడీపీ లేదని, ఆ పార్టీని ఎందుకు ఆహ్వానిస్తామని ప్రశ్నించారు. తమతో కలసి పనిచేస్తున్న జనసేనకు ఆహ్వానం వెళ్లి ఉంటుందన్నారు. జనసేన తమకు మిత్రపక్షం అని స్పష్టం చేశారు. టీడీపీకి ఆహ్వానం లేదు అని కరాఖండిగా చెబుతున్న మాధవ్, జనసేనకు ఆహ్వానం ఉందో లేదో తేల్చి చెప్పలేకపోతున్నారు. అటు జనసేన నుంచి కూడా దీనిపై క్లారిటీ లేదు. మొత్తమ్మీద ఏపీ బీజేపీకి టీడీపీతో కలవడం ఏమాత్రం ఇష్టం లేదని తేలిపోయింది. గతంలో వీర్రాజు కూడా ఇదే విషయంలో క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు మరోసారి మాధవ్ టీడీపీని తీసిపారేసినట్టు మాట్లాడారు.
హైకమాండ్ నిర్ణయిస్తే..
ప్రస్తుతం తమ పొత్తు జనసేనతోనే అంటున్నారు మాధవ్. టీడీపీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తే.. అప్పుడు రాష్ట్ర పార్టీ తరపున తమ అభిప్రాయాన్ని వారికి తెలియజేస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో జనసేనతో కలిసి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు.