Telugu Global
Andhra Pradesh

NCC విద్యార్థుల ర్యాగింగ్.. అది కూడా వారి ఖాతాలోనే

నడిరోడ్డు మీద హత్య చేస్తేనే పోలీసులు ఏమీ చేయలేదు.. కర్రలతో కొడితే దిక్కెవరంటూ హోం మంత్రి అనితను ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

NCC విద్యార్థుల ర్యాగింగ్.. అది కూడా వారి ఖాతాలోనే
X

ఏపీలో ఇద్దరు కొట్టుకున్నారు.

ముందుగా వినిపించే ప్రశ్నలు.. బాధితుడిది ఏ పార్టీ, కొట్టినవాడు ఏ పార్టీ..?

తర్వాతి ప్రశ్న.. అది జరిగింది ఎన్నికలకు ముందా..? ఎన్నికల తర్వాతా..?

ఆ తప్పుని ఎవరి ఖాతాలో వేయాలో నిర్ణయించడానికే ఈ ప్రశ్నలు. బాధితుడు వైసీపీకి చెందిన వ్యక్తి అయితే టీడీపీ అరాచకం మొదలైంది అనొచ్చు. బాధితుడు టీడీపీ అయితే.. వైసీపీ నేతలు ఇంకా తమ దారుణాలు ఆపలేదని నింద వేయొచ్చు. ఒకవేళ ఆ తప్పు ఎన్నికలకు ముందు జరిగితే అది వైసీపీ ఖాతాలో, ఫలితాల తర్వాత జరిగితే దాన్ని టీడీపీ ఖాతాలో ఈజీగా వేసేయొచ్చు. ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా దానికి రాజకీయ రంగులు అద్దుతున్నారు. తప్పుని తప్పులా చూడటంలేదు, ఎవరు చేశారు, ఏ పార్టీ వాళ్లు వెనకున్నారనే రంధ్రాన్వేషణ ఎక్కువగా సాగుతోంది.

తాజాగా సోషల్ మీడియాలో ఓ ర్యాగింగ్ వీడియో వైరల్ అయింది. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో NCC విద్యార్థులు జూనియర్ బ్యాచ్ ని ర్యాగింగ్ చేశారు. హాస్టల్ రూమ్ లో కొంతమందిని కర్రలతో చితకబాదారు. వెంటనే వైసీపీ నుంచి ఓ ట్వీట్ పడింది. ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ర్యాగింగ్ శృతి మించుతోందని, ఇదీ ప్రస్తుతం మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అని ట్వీట్ వేశారు. నడిరోడ్డు మీద హత్య చేస్తేనే పోలీసులు ఏమీ చేయలేదు.. కర్రలతో కొడితే దిక్కెవరంటూ హోం మంత్రి అనితను ట్యాగ్ చేస్తూ ఆ ట్వీట్ వదిలారు .


అది మీ హయాంలోనే..

ఆ తర్వాత టీడీపీ ట్వీట్ వేసింది. ఆ ఘటన జరిగింది ఫిబ్రవరిలో అని, అప్పుడు వైసీపీయే అధికారంలో ఉందని, అందుకు వైసీపీయే బాధ్యత వహించాలని టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలోనే లా అండ్ ఆర్డర్ అలా ఉందని బదులు చెప్పారు. పోలీస్ అధికారి వాయిస్ ని జత చేశారు.


ర్యాగింగ్ జరగడం పెద్ద తప్పు. అందులోనూ క్రమశిక్షణకు మారుపేరు అయిన NCC ట్రైనింగ్ లో ర్యాగింగ్ జరగడం మరింత తప్పు. ఆ తప్పుని ఎలా సరిదిద్దాలో ఆలోచించాల్సింది పోయి బాధితుడిది బులుగు రంగు, కొట్టిన వాడు వేసుకుంది పసుపు చొక్కా అంటూ నానార్ధాలు, పెడర్థాలు తీయడం ఎంతవరకు సమంజసం అంటున్నారు ఈ ట్వీట్ల సంవాదం చూసిన నెటిజన్లు.

First Published:  25 July 2024 5:23 AM GMT
Next Story