గాజు గ్లాస్ కి నీళ్ల బకెట్ అడ్డు.. పవన్ రూ.5కోట్ల ఆఫర్..!
పవన్ కల్యాణ్ తమకు రూ.5కోట్లు ఆఫర్ ఇచ్చారని అంటున్నారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ తాము ఆ ఆఫర్ కి ఒప్పుకోలేదని, దీంతో జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి గన్ చూపెట్టి బెదిరించారని ఆరోపించారు.
ఎన్నికలలో ఒక పార్టీ గుర్తుని పోలిన గుర్తులు మరికొన్ని ఉంటాయి. ఆయా గుర్తులతో తమకు నష్టం జరుగుతుందని అనుకుంటే.. ఈసీకి ఫిర్యాదు చేయాలి, లేదా తమ గుర్తులపై స్పష్టమైన అవగాహన వచ్చేలా ప్రచారం చేసుకోవాలి. కానీ బకెట్ గుర్తు ఉన్న తమను జనసేన బెదిరిస్తోందని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ పై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ఫిర్యాదు చేసిన అంతరం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. పవన్ కల్యాణ్, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బాలశౌరిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
రూ. 5 కోట్లు ఆఫర్
ఏపీలో గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అంటూ ఇటీవల ఎన్నికల కమిషన్ గెజిట్ విడుదల చేయడంతో పెద్ద గంరగదోళం నెలకొంది. పోనీ ఆ గొడవ సమసిపోతుందని అనుకున్నా.. ఇప్పుడు నవరంగ్ రూపంలో బకెట్ అడ్డొస్తోంది. నీళ్ల బకెట్ కూడా గాజు గ్లాసుని పోలీ ఉంటుంది కాబట్టి.. జనసేనకు పడాల్సిన ఓట్లు పొరపాటున బకెట్ సింబల్ పై పడే అవకాశముందని అనుమానిస్తున్నారు నేతలు. నయానో భయానో బకెట్ ను పోటీనుంచి తప్పించాలనుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తమకు రూ.5కోట్లు ఆఫర్ ఇచ్చారని అంటున్నారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్. కానీ తాము ఆ ఆఫర్ కి ఒప్పుకోలేదంటున్నారు. దీంతో జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి గన్ చూపెట్టి బెదిరించారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని నవరంగ్ పార్టీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అసలే కూటమితో ఏపీలో అసంతృప్త నేతలు పెరిగిపోయారు. పొరపాటున పోతిన మహేష్ లాంటి వాళ్లు నవరంగ్ పార్టీ తరపున బకెట్ గుర్తుపై పోటీ చేస్తే ఇంకేమైనా ఉందా..? గెలుపు సంగతి పక్కనపెడితే ఓట్లు గణనీయంగా చీలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే జనసేన అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. అందుకే ఆ పార్టీ నేతలు హడావిడి పడుతున్నారు. డబ్బులిచ్చి బతిమాలాలని చూశారని, వినకపోయేసరికి గన్ చూపించి బెదిరించారంటూ నవరంగ్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏపీలో సంచలనంగా మారాయి. దీనిపై జనసేన నేతలు స్పందించాల్సి ఉంది.