పుంగనూరు ఆవులకు జాతీయ అవార్డు
జాతీయ స్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నారు.
`మిషన్ పుంగనూర్` కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుంగనూరు జాతి ఆవుల పరిరక్షణ కోసం చేపట్టిన కార్యాచరణ ఫలించింది. పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ - 2022 అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో అరుదైన, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు కృషి చేసే సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో జరుగనున్న కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నారు. ఈ అవార్డు కింద ప్రత్యేక ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతిని అందించనున్నారు.
ఈ ఆవులు.. ఏపీకి ప్రత్యేకం..
పుంగనూరు జాతి ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనవి. ప్రపంచంలోనే అత్యంత పొట్టివైన ఈ ఆవులు మూడు అడుగుల పొడవు మాత్రమే పెరుగుతాయి. ఇవి ఎరుపు, గోధుమ రంగు, తెలుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. వీటి తోక నేల భాగాన్ని తాకుతుంది. ఏడాదికి సగటున 500 కేజీల వరకు పాల దిగుబడి ఇస్తాయి. వీటి పాలలో కొవ్వు శాతం 5 నుంచి 8 వరకు ఉంటుంది.
రూ.60 కోట్ల వ్యయంతో కార్యాచరణ...
ఈ జాతి పశువుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం `మిషన్ పుంగనూరు` పేరిట రూ.60 కోట్ల వ్యయంతో కార్యాచరణ చేపట్టింది. ఈ కార్యక్రమం సత్ఫలితాలివ్వడంతో గడచిన మూడేళ్లలో 176 పుంగనూరు దూడలు జన్మించాయి. రీసెర్చ్ స్టేషన్‌లో ప్రస్తుతం 268 పుంగనూరు జాతి పశువులు ఉన్నాయి.
కేటిల్ కేటగిరీలో అవార్డు...
ఈ ఏడాది జాతీయ స్థాయిలో నాలుగు కేటగిరీల్లో బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డులను ఐసీఏఆర్ ప్రకటించింది. పుంగనూరు జాతి ఆవుకు కేటిల్ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుతో పుంగనూరు జాతి ఆవు పరిరక్షణకు ఐసీఏఆర్ కూడా అవసరమైన చేయూత అందించేందుకు మార్గం సుగమమైందని రీసెర్చ్ స్టేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వేణు సంతోషం వ్యక్తం చేశారు.