`ఏపీలో అన్ని మద్యం బ్రాండ్లు మీ వాళ్లవే తల్లీ`
పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలా.. టీడీపీ అధ్యక్షురాలా అన్నది అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని తొలిసారిగా చెప్పింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని.. ఆ తరువాత చెప్పింది పవన్ కళ్యాణ్ అని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి తీవ్రంగా ఖండించారు. అసలు మద్యం పాలసీపై మాట్లాడే అర్హతే పురందేశ్వరికి లేదన్నారు. ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తీసుకొస్తే.. ఆయన స్థాపించిన పార్టీని చంద్రబాబు లాక్కుని మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు పురందేశ్వరి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి, ఆమె భర్త సైతం ఎన్టీఆర్ మృతికి కారకులయ్యారని, ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికి ఆమెకు అర్హత లేదన్నారు. ఆదివారం తిరుపతి జిల్లా పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
2014–19 కాలంలో చంద్రబాబు హయాంలోనే ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారని మంత్రి నారాయణస్వామి గుర్తుచేశారు. 2019లో ఏర్పడిన సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గానీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పీఎంకే డిస్టిలరీ యనమల రామకృష్ణుడిదని, శ్రీకృష్ణ డిస్టిలరీ ఆదికేశవులు నాయుడిదని, స్పై డిస్టిలరీ ఎస్పీవై రెడ్డిదని, విశాఖ డిస్టిలరీ అయ్యన్నపాత్రుడిదని మంత్రి వివరించారు. ఇప్పుడున్న ప్రతి బ్రాండూ చంద్రబాబు పాలనలో తీసుకొచ్చినదేనని, అందుకే వాటిని ’సీ’ బ్రాండ్లు అంటున్నారని తెలిపారు.
చంద్రబాబు పాలనలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాశాయని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు తన అనుచర గణానికి 4,378 మద్యం షాపులను కట్టబెట్టడమే కాకుండా, 43 వేల బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ఏరులై పారించారని గుర్తుచేశారు. పురందేశ్వరి తన మరిది చంద్రబాబును, ఆయన కొడుకు లోకేశ్‌ని కాపాడేందుకే మద్యం పాట పాడుతున్నారని మంత్రి నారాయణస్వామి విమర్శించారు.
పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలా.. టీడీపీ అధ్యక్షురాలా అన్నది అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని తొలిసారిగా చెప్పింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని.. ఆ తరువాత చెప్పింది పవన్ కళ్యాణ్ అని గుర్తుచేశారు. చంద్రబాబు అరెస్ట్ న్యాయపరంగానే జరిగిందని రాష్ట్ర ప్రజలు విశ్వసించారని.. అందుకే వారి నుంచి ఎలాంటి వ్యతిరేక స్పందనా రాలేదని చెప్పారు. అలాగే టీడీపీ ఇచ్చే పిలుపులకు కూడా జనం స్పందించడం లేదని ఆయన గుర్తుచేశారు.