కార్లు కొట్టేద్దాం.. ట్రావెల్స్ పెట్టేద్దాం.. - తొలి కారు చోరీలోనే బండారం బట్టబయలు
నిందితుడు మస్తాన్ వలిని గన్నవరంలో ఎక్కించుకున్న డ్రైవర్.. నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ డ్రైవర్ షాజీత్‌కి రూ.1500 ఇచ్చి బిర్యానీ తీసుకురమ్మని చెప్పిన మస్తాన్ వలి.. అతను వెళ్లిన వెంటనే కారుతో పరారయ్యాడు.
అతని దగ్గర కార్లు లేవు.. డబ్బు కూడా లేదు.. అయినా కార్ ట్రావెల్స్ పెట్టాలనుకున్నాడు. కార్ల కోసం దొంగతనాలకు సిద్ధపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఓ కారు దొంగతనం చేశాడు. మొదటి ప్రయత్నంలోనే పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పల్నాడు జిల్లా నరసరావుపేట లోని ఎస్పీ కార్యాలయంలో ఆ జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి శనివారం విలేకరులకు వెల్లడించారు.
నిందితుడి పేరు షేక్ మస్తాన్ వలి. స్వస్థలం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం. అతను తాపీ మేస్త్రీగా పనిచేసి కొంతకాలం క్రితం పని మానేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఓ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా చేరాడు. అక్కడ పనిచేస్తుండగానే అతనికి తాను కూడా ఓ ట్రావెల్స్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. తన దగ్గర డబ్బు లేకపోవడంతో కార్ల కోసం చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా బొల్లారం నుంచి ఇద్దరు తాపీ పని చేసే వారిని మాట్లాడుకుని హైదరాబాద్లో పని ఉందంటూ తీసుకువచ్చాడు. వారిలో ఒకరి వద్ద నుంచి ఫోన్ చోరీ చేశాడు.
చోరీ చేసిన ఫోన్ నుంచి విజయవాడలోని శైలజ ట్రావెల్స్‌కు ఫోన్ చేసి.. వీఎస్ రావు అనే పేరుతో ఈ నెల 20 నుంచి నాలుగు రోజులకు కారు బుక్ చేశాడు. రోజుకు రూ.8 వేలు చెల్లించేలా మాట్లాడుకున్నాడు. గన్నవరం నుంచి కారు బుక్ చేసుకోవడంతో ఆ ట్రావెల్స్ యజమానులు షాజీత్ అనే డ్రైవర్ తో కారును పంపించారు.
నిందితుడు మస్తాన్ వలిని గన్నవరంలో ఎక్కించుకున్న డ్రైవర్.. నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ డ్రైవర్ షాజీత్‌కి రూ.1500 ఇచ్చి బిర్యానీ తీసుకురమ్మని చెప్పిన మస్తాన్ వలి.. అతను వెళ్లిన వెంటనే కారుతో పరారయ్యాడు.
ట్రావెల్స్ యజమాని యుగంధర్ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు ఫోన్ నంబర్, టెక్నాలజీ ఆధారంగా నిందితుడు షేక్ మస్తాన్ వలిగా గుర్తించారు. దొంగిలించిన కారు నంబర్ మార్చి నగరంలో తిప్పుతున్నాడని తెలుసుకున్నారు. అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించడం గమనార్హం.