ఏపీలో 'నరబలి' పాలిటిక్స్
జగన్ సీఎం కాకుండా ఉండేందుకు చంద్రబాబు నరబలి ఇచ్చారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని యువగళం పాదయాత్రలో ధ్వజమెత్తారు. సీఎం పదవి కోసం సొంత బాబాయిని నరబలి ఇచ్చిన చరిత్ర జగన్ దేనని ఆరోపించారు లోకేష్.
సీఎం జగన్ దృష్టిలో పడాలంటే ఏం చేయాలి..? చంద్రబాబుని, లోకేష్ ని చడామడా తిట్టాలి. అందరూ అదే పద్ధతి ఎంచుకునే సరికి కొంతమందికి అవకాశం రావడం లేదు. దీంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి లాంటివారు మరో అడుగు ముందుకేశారు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యేందుకు చంద్రబాబు నరబలి ఇచ్చారని ఆరోపించారాయన. ఇటీవల నార్త్ ఇండియాకి వెళ్లిన చంద్రబాబు అక్కడ క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చి వచ్చారని అన్నారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. త్వరలో వీడియోలు బయటపడతాయని, ఎంక్వయిరీ కూడా చేయిస్తున్నామని చెప్పారు. రెండురోజులుగా ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది.
నరబలి మాది కాదు మీది..
ఈ నరబలి వ్యాఖ్యలు హైలెట్ కావడంతో బియ్యపు మధుసూదన్ రెడ్డి అనుకున్నది సాధించారు. ఆయన మీడియాలో హైలెట్ అయ్యారు, జగన్ దృష్టిలో కూడా పడే ఉంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి దిమ్మతిరిగే కౌంటర్ పడింది. నరబలి ఇచ్చింది మేము కాదు, 2019 ఎన్నికల ముందు వైసీపీయే నరబలి ఇచ్చిందని అన్నారు నారా లోకేష్. జగన్ సీఎం కాకుండా ఉండేందుకు చంద్రబాబు నరబలి ఇచ్చారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని యువగళం పాదయాత్రలో ధ్వజమెత్తారు. సీఎం పదవి కోసం సొంత బాబాయిని నరబలి ఇచ్చిన చరిత్ర జగన్ దేనని ఆరోపించారు లోకేష్.
ఏపీలో ఆరోపణలు ఎక్కడ మొదలై, ఎటువైపు వెళ్తున్నాయో తెలియడం లేదు. ఘాటు పదాలు, బూతు పదాలు.. జనాలకు కూడా అలవాటైపోయాయి. ఇప్పుడిక ఊహాజనిత ఆరోపణలు కూడా శృతి మించుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం నరబలిపై ఆరోపణలు సంచలనంగా మారాయి. 'గే' పాలిటిక్స్ అంటూ కొత్త సెటైర్లు కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి.