Nara Lokesh Padayatra Schedule: 4వేల కిలోమీటర్లు, 400రోజులు.. లోకేష్ టూర్ షెడ్యూల్ రెడీ
Nara Lokesh Padayatra Schedule: టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు లోకేష్. జనవరి 27నుంచి ఏపీలో ధర్మ యుద్ధం మొదలు పెడతామన్నారు.
ఏపీ రాజకీయాల్లో మరో పాదయాత్రకు రంగం సిద్ధమవుతోంది. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ భారీ పాదయాత్రకు ప్రణాళిక రెడీ చేశారు. ధర్మయుద్ధం అనే పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. 2023 జనవరి 27నుంచి ఏపీలో లోకేష్ ధర్మయుద్ధం మొదలు కాబోతోంది. తండ్రి నియోజకవర్గమైన కుప్పంనుంచి లోకేష్ పాదయాత్ర మొదలు పెడతారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు యాత్ర కొనసాగిస్తారు. మొత్తం 4వేల కిలోమీటర్ల మేర ఈ యాత్ర ఉంటుంది. 400 రోజుల్లో ధర్మయుద్ధం పాదయాత్ర పూర్తి చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు నారా లోకేష్.
నియోజకవర్గానికి 4రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా ఈ పాదయాత్రకు రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు నారా లోకేష్. గరిష్టంగా ఒక్కో నియోజకవర్గానికి 4రోజుల సమయం కేటాయించబోతున్నారు. అలా చేయాలంటే ఆయన 700 రోజులు ప్రజల్లోనే ఉండాలి. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కేవలం ఒకటీ రెండు రోజులే ఆయన ఉంటారు. మొత్తంగా పాదయాత్ర 400రోజులు ఉంటుందని అంచనా. తాను పోటీ చేయబోతున్న మంగళగిరిలో కూడా 4రోజులే పర్యటిస్తానన్నారు లోకేష్. మిగతా రోజుల్లో కార్యకర్తలే ప్రజలకు అండగా ఉండాలని, ప్రభుత్వం చేయలేని పనుల్ని పార్టీ శ్రేణులు చేసి చూపించాలని పిలుపునిచ్చారు.
లోకేష్ టీమ్ ఎవరు..?
పాదయాత్రలో నారా లోకేష్ తోపాటు ఎవరెవరు పాల్గొంటారు, ఆయన బస ఏర్పాట్లు ఎలా, పాదయాత్రలో ఎక్కడెక్కడ ప్రసంగాలుంటాయి, ఎవరెవర్ని కలుస్తారు, చంద్రబాబు కూడా లోకేష్ తో కొంతదూరం నడుస్తారా, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనలు ఉంటాయా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. టీడీపీని ఓడించేందుకు సీఎం జగన్ వాడే అన్ని ఆయుధాలను దీటుగా ఎదుర్కోవాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు లోకేష్. జనవరి-27నుంచి ధర్మ యుద్ధం మొదలు పెడతామన్నారు.