మీరు సోంబేర్లు.. - వన్నెకుల క్షత్రియులపై లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు
`మీరు సోంబేర్లు అబ్బా.. మీకు పోరాట పటిమ లేదు.. గట్టిగా నిలదీసి సాధించుకునే మనస్తత్వం లేదు..` అని వ్యాఖ్యనించారు. దీంతో ఒక్కసారిగా విస్తుపోయారు ఆ సంఘ నాయకులు.
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తన పాదయాత్రలో వన్నెకుల క్షత్రియులపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి ఏర్పేడు మండలం కోబాక వరకు లోకేశ్ పాదయాత్ర చేశారు. మార్గంలో బండారుపల్లి సమీపంలో వన్నెకుల క్షత్రియ సంఘం నేతలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. `మీరు సోంబేర్లు అబ్బా.. మీకు పోరాట పటిమ లేదు.. గట్టిగా నిలదీసి సాధించుకునే మనస్తత్వం లేదు..` అని వ్యాఖ్యనించారు. దీంతో ఒక్కసారిగా విస్తుపోయారు ఆ సంఘ నాయకులు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే.. మీకు సామాజికంగా, రాజకీయంగా బాధ్యత కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే బెల్టుషాపులను నిర్మూలిస్తామని, 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేశ్ చెప్పారు. వైఎస్సార్ హయాంలో ఏనాడూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో లేవని, వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా అన్ని పథకాలకూ కోతలు విధిస్తోందని ఆయన ఆరోపించారు.
పాదయాత్రకు జన స్పందన కరువు..
లోకేశ్ పాదయాత్రకు శ్రీకాళహస్తిలో జనస్పందన కరువైంది. కొద్దిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు మినహా స్థానికులు కనిపించలేదు. ఈ నేపథ్యంలో వార్తల్లో నిలవడం కోసం లోకేశ్ నిబంధనలను ఇష్టారీతిన ఉల్లంఘించారు. తొండమాన్‌పురం వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు.