లోకేష్ యువగళం పాదయాత్రకు 29 కండిషన్లు..
Lokesh Padayatra: టపాకాయలు, బాణసంచా పూర్తిగా నిషిద్ధం. సమావేశాల దగ్గరకు వచ్చేవారు ఎలాంటి మారణాయుధాలు తీసుకు రాకుండా నిర్వాహకులే చూసుకోవాలి.
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే సవాలక్ష కండిషన్లు పెట్టారు. ఈ కండిషన్లతో కూడిన ఉత్తర్వులను టీడీపీ శ్రేణులు తీసుకోడానికి నిరాకరించాయి. లోకేష్ యాత్రలో నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనంటున్నారు పోలీసులు. మొత్తం 29 కండిషన్లతో కూడిన ఉత్తర్వులు పోలీసులు సిద్ధం చేశారు.
♦ పాదయాత్రలో ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించ కూడదు.
♦ బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలి.
♦ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదు.
♦ రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించాకుడదు.
♦ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా అంబులెన్స్ అందుబాటులో ఉండాలి.
♦ సమావేశ స్థలం దగ్గర అగ్నిమాపక యంత్రం ఉంచాలి.
♦ టపాకాయలు, బాణసంచా పూర్తిగా నిషిద్ధం.
♦ సమావేశాల దగ్గరకు వచ్చేవారు ఎలాంటి మారణాయుధాలు తీసుకు రాకుండా నిర్వాహకులే చూసుకోవాలి.
♦ డ్యూటీలో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను నిర్వాహకులు పాటించాలి.
♦ శాంతి భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలి.
♦ పాదయాత్రలో అవాంఛనీయ ఘటనలు జరిగితే నిర్వాహకులదే పూర్తి బాధ్యత.
ఇలాంటి 29 నిబంధనలు పోలీసులు రూపొందించారు.
తొలిరోజు యాత్ర ఇలా..
కుప్పంలో ఈ నెల 27నుంచి లోకేష్ యువగళం యాత్ర మొదలవుతుంది. మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరదరాజస్వామి ఆలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు చేస్తారు. కుప్పంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం యాత్ర కొనసాగిస్తారు. సాయంత్రం 4గంటలకు సివిల్ కేసులు ఎదుర్కొంటున్న మహిళా కార్యకర్తలతో నారా లోకేష్ సమావేశం అవుతారు. 4.45 గంటలకు కమతమూరు రోడ్ లో గంటసేపు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ సమీపంలో ఆయన బస చేస్తారు. రెండోరోజు నుంచి ఉదయం 8 గంటలకు పాదయాత్ర మొదలు పెట్టి సాయంత్రం 5.50 గంటలకు యాత్ర ముంగించేలా షెడ్యూల్ సిద్ధం చేశారు.