యువగళానికి సెంటిమెంట్ పూత..
ఇప్పటి వరకూ లోకేష్ నడక మారిందని, ఏదో తేడాగా ఉందంటూ వైసీపీ సెటైర్లు విన్నాం, ఇప్పుడు లోకేష్ యాత్రకి జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త సెంటిమెంట్ ని దట్టించారు.
నారా లోకేష్ యువగళం సవాళ్లు, ప్రతి సవాళ్లు, సెల్ఫీలతో సీరియస్ గానే సాగిపోతోంది. అయితే ఇందులో ఎక్కడా సెంటిమెంట్ కి చోటు లేకుండా పోయింది. తాజాగా ఆ లోటు తీర్చేశారు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. పాదయాత్రలో లోకేష్ పడుతున్న కష్టాలను ఆయన ప్రస్తావించారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా లెక్క చేయకుండా లోకేష్ యాత్ర కొనసాగిస్తున్నారని, శెహభాష్ అంటూ మెచ్చుకున్నారు.
నువ్వు తగ్గొద్దు..
లోకేష్ అరికాలికి బొబ్బలు వచ్చాయని, అయినా ఆయన తగ్గడంలేదని, ఆయన తగ్గాల్సిన అవసరం లేదని, ఆ కష్టాన్ని దిగమింగుకుని యాత్ర కొనసాగించాలని, ఆయన వెనక తామంతా ఉన్నామని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. లోకేష్ కాలి బొబ్బల గురించి చెబుతూ ఆయన కంటతడి పెట్టారు. ఈ వీడియో టీడీపీ అనుకూల మీడియాలో హైలెట్ అవుతోంది.
@naralokesh పాదయాత్ర నిజంగా నన్ను ఉద్వేగానికి గురిచేసింది. గారాబంగా ఇంట్లో పెరిగిన పిల్లాడు నేడు సమాజ హితం కోసం కాళ్ళకు బొబ్బలు వచ్చేలా తిరగడం చూసి భాదేసింది. తాను పడుతున్న కష్టానికి తప్పకుండా రాష్ట్ర ప్రజలు ఫలితాన్ని ఓటుద్వారా ఇస్తారని ఆశిస్తున్నా. pic.twitter.com/tUSeOuaDn4
— JC Prabhakar Reddy (@JCPRTDP) April 14, 2023
ఆ ఇద్దరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా..
ప్రజలు, రాష్ట్రం కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని.. ఆయన సతీమణి, తల్లికి ఈ విషయంలో చేతులెత్తి నమస్కరించాలన్నారు జేసీ. పాదయాత్రలో 2 రోజులు పాల్గొంటేనే తన కుమారుడికి కాళ్లు నొప్పులు వచ్చాయని, ప్రజల కోసం లోకేష్ వందల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నందమూరి తారక రామారావుని చూసినట్టుగా లోకేష్ ని జనం చూస్తారని అన్నారు ప్రభాకర్ రెడ్డి. ఇప్పటి వరకూ లోకేష్ నడక మారిందని, ఏదో తేడాగా ఉందంటూ వైసీపీ సెటైర్లు విన్నాం, ఇప్పుడు లోకేష్ యాత్రకి జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త సెంటిమెంట్ ని దట్టించారు.