Telugu Global
Andhra Pradesh

‘యువగళం’ టైటిల్ కి న్యాయం చేయలేకపోతున్న లోకేష్

లోకేష్ యాత్ర మొదలు పెట్టింది రోజాని విమర్శించడానికి కాదు, మూడు రోజులపాటు ఒకే నాయకురాలిని తిట్టడం, ఆమెతో తిట్టించుకోడానికి కాదు.

‘యువగళం’ టైటిల్ కి న్యాయం చేయలేకపోతున్న లోకేష్
X

ఏదో ఒక యాత్ర చేయాలి, జనంలోకి వెళ్లాలి, సరిగ్గా ఎన్నికల టైమ్ కి అన్ని నియోజకవర్గాలు చుట్టేసి రావాలి. ఈ టార్గెట్ తో నారా లోకేష్ యాత్ర మొదలు పెట్టినట్టున్నారే కానీ ‘యువగళం’ అనే టైటిల్ కి అక్కడ జరుగుతున్న వ్యవహారానికి అసలేమాత్రం సంబంధం లేనట్టుగా కనపడుతోంది. ‘యువగళం’ అనే టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత యువత అంతా ఫలానా వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోండి, మీ గొంతు వినిపించండి అంటూ ప్రచారం చేశారు. అలా రిజిస్టర్ చేసుకున్నవారు ఎంతమంది, వారిని లోకేష్ ఎక్కడ కలుస్తున్నారు, వారి ఆలోచనలు వింటున్నారా లేదా అనేది మాత్రం ఇంకా తేలలేదు. 20రోజులుగా యాత్ర జరుగుతున్నా, అన్ని గళాలు వినిపిస్తున్నా యువగళం మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో వినిపించలేదు.

రోజాతోనే సరిపెడతారా..?

మంత్రి రోజాపై వరుసగా మూడురోజులపాటు నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జబర్దస్త్ ఆంటీ, డైమండ్ పాప అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. అవతలివారు కూడా ఏం తక్కువతినలేదనుకోండి.. అయితే ఇక్కడే నారా లోకేష్ వైసీపీ ట్రాప్ లో పడిపోయినట్టు స్పష్టమవుతోంది. లోకేష్ యాత్ర మొదలు పెట్టింది రోజాని విమర్శించడానికి కాదు, మూడు రోజులపాటు ఒకే నాయకురాలిని తిట్టడం, ఆమెతో తిట్టించుకోడానికి కాదు. కానీ లోకేష్ స్థానిక విమర్శలతోనే సరిపెడుతున్నారు.

సెల్ఫీలతో ఉపయోగం ఏంటి..?

అప్పట్లో జగన్ తో సెల్ఫీ దిగడానికి యువత ఉత్సాహం చూపించింది, ఇప్పుడు కూడా నాయకులెవరైనా వస్తే సెల్ఫీలకోసం జనం ఎగబడతారు. అది సహజంగా జరిగేదే, అయితే కేవలం సెల్ఫీలకోసమే టైమ్ కేటాయించడం మాత్రం యాత్ర ఉద్దేశాన్ని ప్రశ్నిస్తోంది. టీ బంకు, టిఫిన్ కొట్టు, ఆర్టీసీ బస్సు.. ఇలా అన్ని చోట్లా లోకేష్ ప్రజల సమస్యలను వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ టీడీపీ, వైసీపీ పాలనలో స్పష్టమైన తేడాను మాత్రం చెప్పలేకపోతున్నారు. సంక్షేమ పథకాల్లో లోపాలను సునిశితంగా ఎత్తి చూపించలేకపోతున్నారు.

మొత్తమ్మీద లోకేష్ పాదయాత్ర ఏదో నామమాత్రంగా జరుగుతోందనే భావన ప్రజల్లో వచ్చేసింది. దీన్ని కవర్ చేసుకోడానికి టీడీపీ అనుకూల మీడియా తంటాలు పడుతున్నా, సోషల్ మీడియాలో ప్రమోషన్ పెంచినా పెద్దగా ప్రయోజనం కనిపించడంలేదు. అందులోనూ ఏపీలో ఎండలు చురుకు పుట్టిస్తున్నాయి. ఈ దశలో లోకేష్ యాత్ర ఎలా కొనసాగుతుంది, ఎంత సమర్థంగా ఆయన ముందుకెళ్తారు, ఈ యాత్ర పార్టీకి ఏమేరకు ఉపయోగపడుతుందనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

First Published:  16 Feb 2023 6:10 AM IST
Next Story