జగన్ ఇలాకాలోకి నారా లోకేష్ అడుగు.. ఫస్ట్ సవాల్ ఇదే!
జమ్మలమడుగులో ఇప్పుడు నారా లోకేష్ తన పాదయాత్రతో మళ్లీ కేడర్‌లో జోష్‌ని నింపడంతో పాటు సీనియర్ నేతల్ని ఏకతాటిపైకి తేవడం పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది.
టీడీపీ యువనేత నారా లోకేష్ జగన్ ఇలాకాలోకి అడుగుపెట్టాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 41 రోజులు పాదయాత్ర చేసిన నారా లోకేష్.. కడప జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్న కందుకూరు మీదుగా కడప జిల్లా సుద్దపల్లె గ్రామంలోకి ప్రవేశించిన నారా లోకేష్‌కి జమ్మలమడుగు రూపంలో ఆదిలోనే పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది.
వాస్తవానికి గతంలో టీడీపీకి జమ్మలమడుగులో మంచిపట్టు ఉండేది. అప్పట్లో గుండ్లకుంట శివారెడ్డి తన రాజకీయ చతురతతో టీడీపీకి ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మలిచారు. ఆయన తర్వాత కూడా రామసుబ్బారెడ్డి ఆ పట్టుని కొనసాగించారు. దాంతో చంద్రబాబు పిలిచి మరీ తన కేబినేట్‌లో చోటిచ్చారు. కానీ.. 2014 నుంచి టీడీపీకి జమ్మలమడుగులో క్రమంగా పట్టు చేజారుతూ వస్తోంది. దానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు కూడా ఓ కారణం.
వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో గెలిచిన ఆదినారాయణ రెడ్డి పదవిపై వ్యామోహంతో టీడీపీలోకి చేరడం అప్పట్లో పార్టీకి పెద్ద ప్రతికూలంగా మారింది. ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన రామసుబ్బారెడ్డి ఆ చేరికని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు వినలేదు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఊహించని విధంగా జమ్మలమడుగులో ఓటమిపాలయ్యారు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన సుధీర్ రెడ్డి ఘన విజయం సాధించారు. చంద్రబాబు చేసిన ఆ పొరపాటు కారణంగా అటు రామసుబ్బారెడ్డితో పాటు ఆదినారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడిపోయింది. ఆదినారాయణ రెడ్డి టీడీపీ వైపు రావడంతో కొంతకాలానికి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. దాంతో టీడీపీ కేడర్ కూడా అయోమయంలో ఉంది.
జమ్మలమడుగులో ఇప్పుడు నారా లోకేష్ తన పాదయాత్రతో మళ్లీ కేడర్‌లో జోష్‌ని నింపడంతో పాటు సీనియర్ నేతల్ని ఏకతాటిపైకి తేవడం పెద్ద సవాల్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే నంద్యాలలో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాల్ని పరిష్కరించడంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ విఫలమయ్యారు. దాంతో ఇద్దరూ బహిరంగంగానే గొడవపడి కర్నూలులో టీడీపీ పరువు తీశారు. దాంతో జమ్మలమడుగులో నారా లోకేష్ పాదయాత్రపై టీడీపీ అధినాయకత్వం అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా.. నారా లోకేష్ విమర్శల విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించాలని సూచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రామసుబ్బారెడ్డిపై నోరుజారితే అడ్డంగా బుక్ అయ్యే అవకాశం ఉంది. అలానే వైసీపీపై అతిగా విమర్శలు గుప్పించినా.. అది ఎదురుతన్నే ప్రమాదం ఉంది.
నియోజకవర్గంలో మారిన పరిస్థితుల దృష్ట్యా జమ్మలమడుగులో పాదయాత్ర ముగిసేలోపు టికెట్ తనకే ఇవ్వబోతున్నారని నారా లోకేష్‌తో ఓ ప్రకటన చేయించుకోవాలని ఆదినారాయణ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ జనసేనతో పొత్తుల వ్యవహారం తేలే వరకూ ఆ ప్రకటన ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఇలా టికెట్ ప్రకటన కోసం వెంపర్లాడి అత్యుత్సాహం ప్రదర్శించిన భూమా అఖిల ప్రియ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయాన్ని ఆదినారాయణ రెడ్డి గుర్తుంచుకోవాలి.