సెంచరీ కొట్టిన లోకేష్.. యువగళంలో భువనేశ్వరి
లోకేష్ 100 రోజుల పాదయాత్ర సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా ఫుల్ కవరేజ్ తో హడావిడి చేస్తోంది. అందులోనూ భువనేశ్వరి యాత్రలో పాల్గొనడంతో హైప్ వచ్చింది.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర వందోరోజుకి చేరుకుంది. ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు లోకేష్. బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి 100వ రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. ఈరోజు యాత్రలో ఆయన తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్ ను నారా లోకేష్ ఆవిష్కరించారు.
లోకేష్ 100 రోజుల పాదయాత్ర సందర్భంగా టీడీపీ అనుకూల మీడియా ఫుల్ కవరేజ్ తో హడావిడి చేస్తోంది. అందులోనూ భువనేశ్వరి యాత్రలో పాల్గొనడంతో హైప్ వచ్చింది. అడుగడుగునా లోకేష్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు నేతలు. యాత్రలో టీడీపీ పసుపు జెండాలతోపాటు, యువగళం కోసం రెడీ చేసిన ఎర్ర జెండాలు కూడా రెపరెపలాడుతున్నాయి.
తల్లికి షూ లేస్ కట్టిన లోకేష్..
నందమూరి కుటుంబ సభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, జయశ్రీ.. తదితరులు ఈ యాత్రలో లోకేష్ తో కలసి ముందుకు కదిలారు. రోడ్డుపై తల్లి భువనేశ్వరి షూ లేస్ ఊడిపోగా నారా లోకేష్ స్వయంగా కట్టారు. తెలంగాణ టీడీపీ తరపున నాయకులు ఈరోజు లోకేష్ ని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
100 రోజుల్లో సాధించిందేంటి..?
నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటినుంచి వైసీపీ నాయకులు ఓ రేంజ్ లో సెటైర్లు పేలుస్తున్నారు. మరోవైపు పెద్దగా మెరుపులేవీ లేకపోయినా యాత్రను మాత్రం గ్యాప్ లేకుండా కొనసాగిస్తున్నారు లోకేష్. అక్కడక్కడ అభ్యర్థుల్ని కూడా ప్రకటిస్తూ ముందుకెళ్తున్నారు. అప్పుడప్పుడు వైరి వర్గం మీడియాలో కూడా కనపడుతూ హైలెట్ అవుతున్నారు లోకేష్. యాత్రతో లోకేష్ ఏమేరకు పరిణతి సాధించారు, పార్టీకి ఈ యాత్ర ఎలా ఉపయోగపడింది అనే విషయాలు మాత్రం వచ్చే ఎన్నికల ఫలితాల్లో తేలిపోతాయి.