Telugu Global
Andhra Pradesh

జూనియర్ ఎన్టీఆర్ కోసమే లోకేష్ యాత్ర.. వల్లభనేని వంశీ లాజిక్

లోకేష్ పాదయాత్ర టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక భారంగా మారిందంటున్నారు వల్లభనేని వంశీ. ఫ్లెక్సీలకు, టీ, టిఫిన్లకు కార్యకర్తలే ఖర్చు పెట్టుకుంటున్నారని, వారందరికీ ఆ ఖర్చు తిరిగి రాదన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కోసమే లోకేష్ యాత్ర.. వల్లభనేని వంశీ లాజిక్
X

నారా లోకేష్ పాదయాత్ర కేవలం జూనియర్ ఎన్టీఆర్ ని అడ్డుకోవడానికేనన్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. చంద్రబాబు ఇవే తనకు చివరి ఎన్నికలు అంటున్నారని, ఆయన తర్వాత పార్టీని, పార్టీ వ్యవహారాలను జూనియర్ ఎన్టీఆర్ లాగేసుకుంటారేమోననే భయంతో ఇప్పుడు లోకేష్ ని జనంలోకి పంపించారన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ పార్టీకోసం ప్రచారం చేస్తే, ఇప్పుడు తాను రాష్ట్రమంతా పాదయాత్ర చేశానని గొప్పలు చెప్పుకోడానికే లోకేష్ జనంలోకి వచ్చారంటున్నారు వంశీ. అసలు లోకేష్ కోటలో ఉన్నా ఒకటే, పేటలో ఉన్నా ఒకటేనంటూ ఎద్దేవా చేశారు. ఆ యాత్ర వల్ల టీడీపీకి ఒక్క ఓటు కూడా పెరగదన్నారు.

కార్యకర్తలకు ఆర్థిక భారం..

లోకేష్ పాదయాత్ర టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక భారంగా మారిందంటున్నారు వల్లభనేని వంశీ. ఫ్లెక్సీలకు, టీ, టిఫిన్లకు కార్యకర్తలే ఖర్చు పెట్టుకుంటున్నారని, వారందరికీ ఆ ఖర్చు తిరిగి రాదన్నారు. లోకేష్‌ యాత్ర ఏదో ఒక రికార్డ్‌ ప్రయోజనం కోసమే చేస్తున్నట్టుందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ తో లోకేష్ ని మ్యాచ్ చేసేందుకే ఆయన్ను రోడ్డుమీదకు తెచ్చారన్నారు.

వారికి ఏం ఆశ చూపించారో..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్ వేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఏం ఆశ చూపించారో అని అన్నారు వంశీ. అధికార పార్టీ ఇవ్వలేనిది, ప్రతిపక్షం ఇస్తుందంటే ఎలా అర్థం చేసుకోవాలన్నారు. తనకు పరీక్షలు ఉన్నందువల్లే మీటింగ్ కి రాలేకపోయానని, తాను, కొడాలి నానీ పార్టీలు మారడం అసంభవం అని చెప్పారు. ఒకవేళ టీడీపీ అలా అనుకుంటే అవి మెరుపు కలలే అని చెప్పారు. ఒక ఎమ్మెల్సీ సీటు ఓడిపోయినంత మాత్రాన వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని, అవి ప్రత్యక్ష ఎన్నికలు కావని వివరణ ఇచ్చారు.

First Published:  4 April 2023 11:43 AM GMT
Next Story