Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యే టికెట్ కోసం మామ బాలయ్యకు ఝలక్ ఇవ్వనున్న లోకేశ్?

మంగళగిరిలో జరుగుతున్న పరిణామాలు చూసిన లోకేశ్.. సేఫ్ సెగ్మెంట్‌ను వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ సారి హిందూపురం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. గత రెండు పర్యాయాలు లోకేశ్ మామయ్య బాలకృష్ణ అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఎమ్మెల్యే టికెట్ కోసం మామ బాలయ్యకు ఝలక్ ఇవ్వనున్న లోకేశ్?
X

టీడీపీ అధినేత నారా చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన లోకేశ్.. ఇప్పటి వరకు ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా గెలవలేదు. తండ్రి చంద్రబాబు దయతో ఎమ్మెల్సీ, మంత్రి పదవులు అనుభవించారు. రాజకీయానుభవం వస్తుందని చంద్రబాబు భావించారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తాడని ఆశించారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలన్నీ తారుమారయ్యాయి. మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయారు. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం కనుక లోకేశ్.. 2024 ఎన్నికలకు పూర్తిగా సన్నద్దం అవుతాడని టీడీపీ అభిమానులు భావించారు. మరోసారి మంగళగిరి నుంచే పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ లోకేశ్ తీరు చూస్తుంటే ఈ సారి మంగళగిరి నుంచి పోటీ చేయడం కష్టమే అని అర్థం అవుతోంది.

ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే.. అక్కడి నుంచి బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతే కానీ మంగళగిరి నుంచి పోటీ చేస్తానని మాత్రం స్పష్టం చేయలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత లోకేశ్ ఆ నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కరోనా కారణం చెప్పి రెండేళ్ల పాటు ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చినా.. మంగళగిరిలో మాత్రం పెద్దగా పర్యటించలేదు. మరోవైపు వైసీపీ మంగళగిరిని మరోసారి తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం నుంచి సాధ్యమైనన్ని నిధులు రప్పించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక బీసీ నేత, టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి కూడా వైసీపీలో చేరారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా టీడీపీని వదిలేశారు.

మంగళగిరిలో జరుగుతున్న పరిణామాలు చూసిన లోకేశ్.. సేఫ్ సెగ్మెంట్‌ను వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ సారి హిందూపురం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. గత రెండు పర్యాయాలు లోకేశ్ మామయ్య బాలకృష్ణ అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో కూడా బాలయ్య అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తన సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్, అంబులెన్సులు వంటివి ఏర్పాటు చేశారు. హిందూపురం టీడీపీకి పెట్టని కోటలాంటిది. 1983 నుంచి తెలుగుదేశం తప్ప మరో పార్టీ అభ్యర్థి అక్కడ గెలవలేదు. వైసీపీ ప్రభంజనం వీచిన 2019లో కూడా బాలయ్య తన ఓటింగ్ శాతాన్ని పెంచుకొని మరీ గెలిచారు. దీంతో ఆ సెగ్మెంట్ అయితేనే తనకు సేఫ్ అని నారా లోకేశ్ భావిస్తున్నారు. మామను లోక్‌సభకు పోటీ చేయించి.. తాను అసెంబ్లీ బరిలో నిలవాలని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని తన తండ్రి వద్ద కూడా ప్రస్తావించారని.. కానీ చంద్రబాబు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.

మరోవైపు హిందూపురం నుంచి పోటీ కుదరకపోతే రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉండే సెగ్మెంట్లను ఎంచుకోవాలని భావిస్తున్నారు. విశాఖపట్నంలోని నాలుగు సెగ్మెంట్లు, పెనమలూరు, భీమిలి, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాలను కూడా నారా లోకేశ్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయించారని.. తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారని తెలుస్తోంది. కాగా, తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా చెబుతున్న నారా లోకేశ్.. ఉన్న నియోజకవర్గాన్ని వదిలేసి.. మామ నియోజకవర్గంపై కన్నేయడంపై పార్టీలో చర్చ జరుగుతున్నది. ఓడినా గెలిచినా.. మంగళగిరి అయితేనే బెటర్ అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి తండ్రి కొడుకులు చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

First Published:  23 Sept 2022 6:53 AM IST
Next Story