ఏయ్ సీఐ.. ఇది పోకిరి సినిమా కాదు
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పోలీసుల్ని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
ఏపీలో ఉద్యోగులందరిపై టీడీపీ నేతలు పగబట్టినట్టు ఉన్నారు. నారా లోకేష్ పోలీసుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకుంటూ తిరుగుతున్నారు. వాలంటీర్లంతా టెర్రరిస్ట్ లని మరో నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సచివాలయం స్టాఫ్ దండగ అని గతంలో చంద్రబాబు సైతం విమర్శించారు. సచివాలయం మహిళా పోలీస్ లకు కనీసం యూనిఫామ్ వేసుకునే అవకాశం కూడా లేకుండా కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. ఉద్యోగులంటేనే టీడీపీకి ఎక్కడలేని చిరాకు మొదలవుతుంది. తాజాగా నారా లోకేష్ ఓ సీఐపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ వేశారు. మత్తులో ఏం చేస్తున్నారో ఆయనకు తెలియడం లేదని విమర్శించారు. ఇదేమీ పోకిరి సినిమా కాదని వార్నింగ్ ఇచ్చారు.
కారంపూడి సీఐ చిన్న మల్లయ్య గారు వైసీపీ ప్యాకేజీ మత్తులో మీకు తెలియడంలేదు కానీ, మీ జగ్గూభాయ్ సీను ఎప్పుడో కాలిపోయింది. పోకిరి సినిమా అనుకుంటున్నారా? సర్వీస్ రివాల్వర్ గురిపెడుతున్నారు?
— Lokesh Nara (@naralokesh) March 26, 2024
జగ్గూభాయ్ కళ్లలో ఆనందం కోసం సన్నగండ్ల టిడిపి నేత చప్పిడి రాముపై గన్ ఎత్తిన సీఐ… pic.twitter.com/2KOeoUIHVt
అసలేం జరిగింది..?
కారంపూడి సీఐ చిన్న మల్లయ్య, స్థానికంగా ఉన్న ఓ టీస్టాల్ వద్ద తుపాకీతో తమను బెదిరించారనేది టీడీపీ నేతల ఆరోపణ. ఉత్తి పుణ్యానికి సీఐ తుపాకీ ఎందుకు తీశారో వారికే తెలియాలి. ఇక వారి ఆరోపణలు అడ్డు పెట్టుకుని లోకేష్ రెచ్చిపోయారు. కారంపూడి ఎస్సైకి వైసీపీ ప్యాకేజీ మత్తులో తెలియడంలేదు కానీ.. సీఎం జగ్గూభాయ్ సీను ఎప్పుడో కాలిపోయిందని ట్వీట్ చేశారు. ఇదేమీ పోకిరి సినిమా కాదని, సర్వీస్ రివాల్వర్ గురిపెట్టడమేంటని ప్రశ్నించారు. ఆ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషన్ ని ట్విట్టర్ వేదికగా కోరారు లోకేష్.
రెచ్చగొట్టేలా..
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే పోలీసుల్ని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ కి తప్పుడు ఫిర్యాదులు చేసి, ఒకరిద్దర్ని సస్పెండ్ చేయిస్తే మిగతావాళ్ల ముందు తాము ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటున్నారు. కారంపూడిలో జరిగిన ఘటన కూడా అలాంటిదేననే ఆరోపణలున్నాయి. అక్కడ సీఐని టీడీపీ నేతలు రెచ్చగొట్టారు, ఇక్కడ లోకేష్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. దురుద్దేశంతోనే ఏపీలో ఉద్యోగుల్ని టీడీపీ టార్గెట్ చేసిందనే విమర్శలు వినపడుతున్నాయి.