నారా లోకేష్ భుజానికి నంద్యాలలో స్కానింగ్.. ఏమైందంటే?
యాత్ర తాత్కాలికంగా ఆపేసేందుకు నారా లోకేష్ నాటకాలు ఆడుతున్నాడంటూ వైసీపీ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేసింది. దాంతో టీడీపీ కూడా రివర్స్‌లో కౌంటర్ స్టార్ట్ చేసింది.
టీడీపీ యువ నేత నారా లోకేష్ ప్రస్తుతం నంద్యాలలో యువగళం పాదయాత్రని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకోగా.. టీడీపీలోనూ జోష్ పెరుగుతోంది. కానీ.. గత కొన్ని రోజుల నుంచి నారా లోకేష్‌ని భుజం నొప్పి వేధిస్తోంది. ఈరోజు ఉదయం నొప్పి తీవ్రత పెరగడంతో నంద్యాలలోని మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్‌లో స్కానింగ్ తీయించుకున్నారు. రిపోర్ట్‌లను వైద్యులు పరిశీలించాల్సి ఉంది.
అసలు నారా లోకేష్‌కి ఏమైందంటే?
నెలన్నర క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండగా.. కార్యకర్తలు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నారా లోకేష్ కుడి చేతిని పట్టుకుని బలంగా లాగేశారు. దాంతో అప్పటి నుంచి భుజం నొప్పితో నారా లోకేష్ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి నారా లోకేష్ వెంట ఫిజియోథెరపిస్ట్, డాక్టర్ కూడా ఉన్నారు. కానీ ఆ నొప్పి బాధ నుంచి మాత్రం అతనికి ఉపశమనం లభించడం లేదని తెలుస్తోంది.
నంద్యాలలో నొప్పి తీవ్రత పెరగడంతో వైద్యుల సూచన మేరకు పద్మావతి నగర్‌లోని మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్‌కి నారా లోకేష్ వెళ్లారు. అక్కడ అతను భుజానికి స్కానింగ్ తీయించుకుంటున్న ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పాదయాత్ర తాత్కాలికంగా ఆపేసేందుకు నారా లోకేష్ నాటకాలు ఆడుతున్నాడంటూ వైసీపీ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టేసింది. దాంతో టీడీపీ కూడా రివర్స్‌లో కౌంటర్ స్టార్ట్ చేసింది.