Telugu Global
Andhra Pradesh

లోకల్ గా మంటపెడుతున్న లోకేష్..

నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని సిల్లీ బచ్చా అంటూ, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని కోర్డు దొంగ అంటూ రెచ్చగొడుతున్నారు లోకేష్.

లోకల్ గా మంటపెడుతున్న లోకేష్..
X

యువగళం పాదయాత్రలో నారా లోకేష్, స్థానిక వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ వెటకారంగా మాట్లాడుతున్నారు. తాను జిల్లాలోనే ఉన్నానన్న విషయాన్ని ఆయా జిల్లాల్లోని వైసీపీ నేతలతోనే ప్రచారం చేయించుకుంటున్నారు.

నెల్లూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని సిల్లీ బచ్చా అంటూ, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని కోర్డు దొంగ అంటూ రెచ్చగొడుతున్నారు లోకేష్. వారు కూడా అదే స్థాయిలో లోకేష్ పై మండిపడుతున్నారు. లోకేష్ యాత్రకు మంచి ప్రచారం ఇస్తున్నారు. నెల్లూరు సిటీలో అనిల్ కి జగన్ టికెట్ ఇవ్వరని, అందుకే ఆయన ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని అన్నారు లోకేష్. సర్వేపల్లి అభివృద్ధిని కాకాణి పట్టించుకోవట్లేదని, కోర్డు దొంగగా కేసులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాలో రోజుకి రెండు ప్రెస్ మీట్లు కేవలం లోకేష్ గురించే ఉంటున్నాయి. ఆయనకి పరోక్షంగా జిల్లా వైసీపీ నాయకులు బాగానే ప్రచారం చేసి పెడుతున్నారు. ఇక ఫ్లెక్సీలకోసం జరిగే రభసతో యువగళం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది.

జగన్ ని కూడా..

స్థానిక నాయకులపై విరుచుకుపడుతూనే.. మరోవైపు జగన్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు లోకేష్. ఇంటికో సత్య నాదెళ్లని తయారు చేస్తామని జగన్ చెబుతున్నారని, కానీ ఆయన పాలనలో ఊరికో అనంతబాబు రెడీ అవుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అని సెటైర్లు పేల్చారు. చంద్రబాబుని చూస్తే కియా గుర్తొస్తుందని, జగన్ ని చూస్తే కోడికత్తి జ్ఞాపకమొస్తుందన్నారు లోకేష్. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కి దమ్ముంటే ఇంటింటికీ స్టిక్కర్ వేసే బదులు, కరెంటు బిల్లుమీద, బస్సు టికెట్ మీద, ఇంటిపన్ను, చెత్త పన్ను రశీదుల మీద స్టిక్కర్లు వేసుకోవాలని సవాల్ విసిరారు. సింహపురిలో తాను సింహంలా అడుగుపెట్టానని, పరదాలు కట్టుకుని యాత్ర చెయ్యడంలేదని అన్నారు లోకేష్. యువగళం యాత్రకు వస్తున్న స్పందన చూసి పిల్ల సైకోలు రోడ్ల మీదకి వచ్చి మొరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

First Published:  2 July 2023 3:12 AM GMT
Next Story