Telugu Global
Andhra Pradesh

పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్.. సెంటిమెంట్ కొనసాగిస్తారా..?

లోకేష్ పాదయాత్ర 400 రోజుల పాటు సాగనుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు లోకేష్ తన పాదయాత్రను చేప‌ట్ట‌నున్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన 4 వేల కిలోమీటర్ల మేర నడువనున్నారు.

పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్.. సెంటిమెంట్ కొనసాగిస్తారా..?
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట తలపెట్టిన పాదయాత్రను ప్రారంభించారు. ఇవాళ ఉదయం 11.03 గంటలకు కుప్పంలో ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా లోకేష్ కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. రాజకీయంగా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఈ ఆలయంలో పూజలు చేయడం చంద్రబాబుకు సెంటిమెంట్. లోకేష్ కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వస్తుంటారు.

గతంలో పలుసార్లు కుప్పంలో పర్యటించిన లోకేష్ ఎన్నికల ప్రచారం, ర్యాలీలు తదితర కార్యక్రమాలు లక్ష్మీపురంలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఇప్పుడు కూడా లోకేష్ పాదయాత్ర ప్రారంభించే ముందు లక్ష్మీపురం ఆలయంలో పూజలు చేశారు. కాగా, లోకేష్ పాదయాత్ర 400 రోజుల పాటు సాగనుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు లోకేష్ తన పాదయాత్రను చేప‌ట్ట‌నున్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన 4 వేల కిలోమీటర్ల మేర నడువనున్నారు.

సెంటిమెంట్ కొనసాగుతుందా?

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించిన ప్రతి నాయ‌కుడు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. 2003లో మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర నిర్వహించారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ విజయానికి కారణమైన వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కూడా వస్తున్నా మీకోసం పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర నిర్వహించారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు.

గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర చేసిన జగన్ ను కూడా ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారు. ఇప్పుడు నారా లోకేష్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్రను ప్రారంభించారు. మరి ప్రజలు లోకేష్ ను కూడా ఆశీర్వదించి అత్యున్నత స్థానం కట్టబెడతారో లేదో వేచి చూడాలి.

అయితే గతంలో పాదయాత్ర నిర్వహించిన వైఎస్, చంద్రబాబు, జగన్ పాదయాత్ర చేయకముందే తమని తాము లీడర్లుగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువై అధికారాన్ని అందుకున్నారు. అయితే ఈ ముగ్గురితో పోలిస్తే లోకేష్ పరిస్థితి వేరు. ఇప్పటివరకు లోకేష్ రాజకీయంగా ఒక్క విజయం కూడా సొంతం చేసుకోలేదు. తనని తాను నిరూపించుకోలేదు. సొంత గుర్తింపు లేదు. అయినా సుదీర్ఘ పాదయాత్రకు లోకేష్ సిద్ధమయ్యారు. మరి ఈ పాదయాత్ర ద్వారా అయినా లోకేష్ ప్రజల్లో గుర్తింపు సాధించి లీడర్ గా ఎదుగుతాడేమో చూడాలి.

First Published:  27 Jan 2023 12:43 PM IST
Next Story