Telugu Global
Andhra Pradesh

చిన్న బ్రేక్.. చిటికెలో వచ్చేస్తానన్న లోకేష్

యువగళం అదుర్స్, బెదుర్స్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ శ్రేణులు ఈ వీడియో బయటకు రావడంతో సైలెంట్ అయ్యాయి. కనీసం మార్ఫింగ్ అని కూడా చెప్పుకోలేని పరిస్థితి వారిది.

చిన్న బ్రేక్.. చిటికెలో వచ్చేస్తానన్న లోకేష్
X

నారా లోకేష్ యువగళంలో గర్జిస్తున్నారని, అనర్గళంగా మాట్లాడుతున్నారని చెప్పుకుంటున్నారు టీడీపీ నేతలు. రోజు రోజుకీ లోకేష్ లో పరిణితి పెరిగిపోతోందని, ఆయన పరిజ్ఞానం మరింత విస్తృత మవుతోందని అంటున్నారు. అయితే అవన్నీ వట్టిమాటలేనని నెల్లూరు జిల్లా యువగళం తేల్చేసింది. కనీసం చిన్న చిన్న పడికట్టు పదాలు కూడా లోకేష్ సొంతగా మాట్లాడలేరని అర్థమవుతోంది.

రైతుల గాయాలపైన..

పుండుమీద కారం చల్లడం అనేదానికి వచ్చిన తిప్పలన్నమాట అవి. ఏకంగా రైతుల గాయాలపైన, రైతుల గాయాలపైన.. అంటూ నాలుగుసార్లు అదే మాట వల్లె వేశారు లోకేష్. ముందున్న జనాలకు కానీ, స్టేజ్ పై ఉన్న నాయకులకు కానీ ఏమీ అర్థం కాలేదు. ఒక్క నిమిషం అంటూ ఆయన పేపర్ తీసి ఆ బ్యాలెన్స్ పదాలు పూర్తి చేస్తే కాని అసలు విషయం బోధపడలేదు. కారం చల్లడం అనే పదం కోసం లోకేష్ నాలుగుసార్లు ఆలోచించారు. చిన్న బ్రేక్ తీసుకున్నారు. చివరకు ఇక అది గుర్తుకు రాదు అని తేలిపోవడంతో చేతిలో పేపర్ తీసి గడగడా చదివేశాడు. పైగా ఆంధ్రరాష్ట్రం నల్లబడుతోంది అంటూ ఆయన చెప్పిన మాటలు కూడా కాస్త అయోమయానికి దారి తీశాయి.


స్టేజ్ పై మాట్లాడే సమయంలో నాయకులు తడబడటం సహజమే అయితే ఒక పదం గుర్తు రాకపోతే మరో పదంతో కవర్ చేసుకుంటారు. లేకపోతే కాసేపు సైలెంట్ గా ఉండి, మరో టాపిక్ ఎత్తుకుంటారు. కానీ వక్తృత్వ పోటీల్లో సబ్జెక్ట్ మరచిపోయిన పిల్లలు జేబులోనుంచి పేపర్ తీసి గడగడా చదివేసినట్టు నారా లోకేష్ ఇక్కడ సీన్ క్రియేట్ చేశారు. అందులోనూ ఆయన మరచిపోయింది అంత కష్టమైన సబ్జెక్టేమీ కాదు. అందులో గణాంకాలు కూడా ఏవీ లేవు. రైతుల గాయాలపై కారం చల్లడం అనే వాక్యం పూర్తిగా మాట్లాడలేక లోకేష్ ఇబ్బంది పడటం కామెడీగా మారింది.

సోషల్ మీడియాలో ట్రోలింగ్..

139 రోజులుగా జనాల్లో తిరుగుతున్న లోకేష్ ఇంకా మాట్లాడటం నేర్చుకోలేదా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఎవరో రాసిచ్చిన టాపిక్ ని బట్టీకొట్టి మాట్లాడటం మినహా లోకేష్ కి సొంతగా మాట్లాడే సత్తా లేదని మరోసారి తేలిపోయింది. యువగళం అదుర్స్, బెదుర్స్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ శ్రేణులు ఈ వీడియో బయటకు రావడంతో సైలెంట్ అయ్యాయి. కనీసం మార్ఫింగ్ అని కూడా చెప్పుకోలేని పరిస్థితి వారిది. లోకేష్ పాండిత్యాన్ని ఒప్పుకుని ట్రోలింగ్స్ ని మౌనంగా భరిస్తున్నారు టీడీపీ నేతలు.

First Published:  28 Jun 2023 9:52 PM IST
Next Story