50 రోజుల్లో ఏం పీకారు..? వ్యవస్థలను మేనేజ్ చేశారు..
జైలులో చంద్రబాబు భద్రతకు భరోసా లేదన్నారు లోకేష్. కుటుంబ సభ్యుల్నే లేపేసినవారు.. జైలులో తన తండ్రికి హాని తలపెట్టరని గ్యారెంటీ ఏముందన్నారు.
చంద్రబాబు రిమాండ్ 50రోజులకు చేరుకుంది. ఈ రోజు భువనేశ్వరి, లోకేష్.. రాజమండ్రి జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు. ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడిన లోకేష్.. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 50 రోజులుగా ఏం పీకారని మండిపడ్డారు. స్కిల్ స్కామ్ లో డబ్బులు ఎక్కడికెళ్లాయి, ఎవరి అకౌంట్లలో పడ్డాయనే ఆధారాలేవైనా పోలీసులు చూపించగలిగారా అని ప్రశ్నించారు. బెయిల్ రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, చివరకు డాక్టర్లను కూడా మేనేజ్ చేస్తున్నారని అన్నారు లోకేష్.
రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారని.. కానీ చంద్రబాబు చనిపోవాలని, ఆయనను చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారని మండిపడ్డారు లోకేష్. అసలీకేసుతో సంబంధం లేని తన తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ మహిళా మంత్రి వ్యాఖ్యానించారని, తన తల్లిని కూడా అరెస్ట్ చేస్తానంటున్నారని, ఇదెక్కడి న్యాయమన్నారు. మంత్రులు చేస్తున్న సామాజిక బస్సు యాత్రకు అర్థం లేదని.. వైసీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులకు ముందు వారు సమాధానం చెప్పాలన్నారు లోకేష్.
జైలులో చంద్రబాబు భద్రతకు భరోసా లేదన్నారు లోకేష్. కుటుంబ సభ్యుల్నే లేపేసిన వారు.. జైలులో తన తండ్రికి హాని తలపెట్టరని గ్యారెంటీ ఏముందన్నారు. ప్రభుత్వం చేయించే ఏ పరీక్షలకు తాము ఒప్పుకోబోమన్నారు. వైద్యుల్ని కూడా ప్రభుత్వం మేనేజ్ చేస్తోందని, చంద్రబాబుకి కొన్ని సమస్యలున్నాయని అన్నారు లోకేష్. చంద్రబాబును బయటకు రానీయకుండా లాయర్ ఫీజుకు పదేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. కావలిలో బస్సుడ్రైవర్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడి చేసిన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు లోకేష్.
♦