మద్య నిషేధం విషయంలో లోకేష్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా..?
అప్పట్లో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ ప్రజల్లోకి వెళ్లి ఎక్కడికక్కడ హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారు. ఇప్పుడు లోకేష్ కి అలాంటి హామీలు ఇవ్వడానికి అవకాశం లేదు. ఉన్నా ఆయన ఇవ్వలేని పరిస్థితి.
తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తానని ఆనాడు ప్రతిపక్షనేతగా చేసిన పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చిన మాట వాస్తవమే. అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా నిషేధం అన్నారు. మూడున్నరేళ్లవుతున్నా నిషేధం ఊసులేదు, భవిష్యత్తులో నిషేధం అమలు చేస్తారనే అంచనా కూడా లేదు. ఈ దశలో.. యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. సంపూర్ణ మద్యనిషేధం హామీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించిన ఆయన.. సంపూర్ణ మద్యనిషేధం హామీని జగన్ అమలు చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ వైఖరి ఏంటి..?
అప్పట్లో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ ప్రజల్లోకి వెళ్లి ఎక్కడికక్కడ హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారు. ఇప్పుడు లోకేష్ కి అలాంటి హామీలు ఇవ్వడానికి అవకాశం లేదు. ఉన్నా ఆయన ఇవ్వలేని పరిస్థితి. మద్యపాన నిషేధాన్నే తీసుకుంటే టీడీపీ ఆ ఊసే ఎత్తదు. ఎంతసేపు జగన్ అమలు చేయలేకపోయారంటున్నారే కానీ, తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తామని చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఎప్పుడూ చెప్పలేదు. చెప్పరు కూడా. మరి జగన్ ఆ హామీని అమలు చేయలేదు అని వేలెత్తి చూపించడం ఎందుకు..? వాళ్లు అమలు చేయలేని హామీని మేము అమలు చేస్తామని చెబితే ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. కానీ టీడీపీ అలా చెప్పట్లేదంటే ఇక టీడీపీకి ఓటెందుకేయాలనే ఆలోచన ప్రజలకు వస్తుంది కదా..!
చీపుర్లతో కొట్టాలి..
వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టండి అన సలహా ఇస్తున్నారు లోకేష్. గతంలో టీడీపీ నేతలు హామీలు అమలు చేయకుండా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రజలు ఇలాగే చేస్తే లోకేష్ ఏం చేసేవాడని ప్రశ్నిస్తున్నారు మంత్రి రోజా. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను 95శాతానికి పైగా అమలు చేశామని, ఓట్లు అడగడానికి టీడీపీ వాళ్లు వస్తే వారిని చీపుర్లతో కొట్టాలని కౌంటర్ ఇచ్చారు రోజా.
నారా లోకేష్ యువగళం పేరుతో జనంలోకి వెళ్తున్నా.. హామీల విషయంలో ఆయనకు నిర్ణయాధికారం లేకపోవడం మైనస్ గా మారింది. సీపీఎస్ రద్దు జగన్ చేయలేకపోతే మేం చేస్తామని టీడీపీ ఎక్కడా చెప్పడంలేదు. సంపూర్ణ మద్య నిషేధం వైసీపీ వల్ల కాకపోతే మేం చేసి చూపిస్తామంటూ టీడీపీ చెప్పుకోలేదు. ఇలాంటి ఇబ్బందులతో యువగళం చప్పగా సాగుతోందనే విమర్శలు వినపడుతున్నాయి. జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఎక్కడికక్కడ హామీలు వెల్లువలా వచ్చాయి. వాటిలోనుంచి నవరత్నాలు పుట్టుకొచ్చాయి. కానీ లోకేష్ యువగళంలో ఎలాంటి కొత్తదనం కనపడ్డంలేదు. పాత విమర్శలే వినపడుతున్నాయి.